కాకినాడ క్రైం: హైరిస్క్ గర్భిణుల విషయంలో క్షేత్రస్థాయిలో అందించే సేవలే కీలకమని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కోనాల అనిత అన్నారు. కాకినాడలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఓ స్వచ్ఛంద సంస్థ ఏఎన్‌ఎంలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించింది. డాక్టర్ అనిత మాట్లాడుతూ, గర్భస్థ సమస్యలు ముందుగానే గుర్తించడం ద్వారా తల్లీ బిడ్డను రక్షించే అవకాశం ఉంటుందన్నారు. ఆరోగ్య సిబ్బంది గర్భిణులను కలిసి పోషకాహారం, వైద్య సేవలు సకాలంలో అందించి, ప్రమాదకర స్థితి నుంచి తప్పించేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏఎన్‌ఎంలు సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా మరింత నాణ్యమైన సేవలు అందించవచ్చన్నారు. మాతా శిశు మరణాల రహిత జిల్లాగా కాకినాడను తీర్చిదిద్దాలని డీఎంహెచ్‌ఓ మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమంలో డీఐఓ కేవీ సుబ్బరాజు, డీపీహెచ్‌ఎన్‌ఓ నీలవేణి తదితరులు పాల్గొన్నారు.


