సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో నిరుద్యోగుల పొట్టకొడుతున్న చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై ప్రజలకు బహిరంగ చర్చ ద్వారా వివరణ ఇవ్వాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. దగా డీఎస్సీకి బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన పట్టుబట్టారు. తుని మర్చంట్ అసోసియేషన్ భవనంలో గారా శ్రీనివాసరావు అధ్యక్షతన దగా డీఎస్సీపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో టౌన్‌హాల్ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దాడిశెట్టి రాజా మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎస్సీ బాధితులు విసురుతున్న సవాల్‌ను స్వీకరించి లోకేష్ చర్చకు రావాలని రాజా అన్నారు. డీఎస్సీ నియామకాల్లో నకిలీ వికలాంగ సర్టిఫికెట్లు, స్పోర్ట్స్ కోటా పేరుతో డబ్బులు తీసుకుని అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారని, అర్హత కలిగిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందన్నారు. రెండేళ్ల పాలనలో ప్రభుత్వం చేసింది ఏమీ లేక, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతూ డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ అరాచకాలకు, డీఎస్సీ అక్రమాలకు నిరసనగా ఈ నెల 10న తుని నియోజకవర్గంతోపాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో భారీ నిరసన ర్యాలీలు చేపడుతున్నట్లు దాడిశెట్టి రాజా వెల్లడించారు. ఈ ర్యాలీకి పార్టీ నాయకులు, విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
పెద్దాపురంలో..
కూటమి ప్రభుత్వ హయాంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ ప్రక్రియలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని, దీనిపై తక్షణమే సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు డిమాండ్ చేశారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన స్పష్టం చేశారు. పెద్దాపురంలోని పార్టీ కార్యాలయంలో నిరుద్యోగ యువత, పార్టీ నాయకులతో నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దగా పడ్డ నిరుద్యోగ యువతకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. డీఎస్సీ అక్రమాలకు నిరసనగా ఈ నెల 6, 7, 8 తేదీల్లో నిరాహార దీక్షలు, 10వ తేదీన భారీ నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఫ డీఎస్సీ అక్రమాలపై
సీబీఐ విచారణ చేయాలి
ఫ టౌన్ హాల్ సమావేశంలో
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రాజా


