బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఎల్‌నినో నేపథ్యంలో ఏలేరు రిజర్వాయర్ కింద ఆయకట్టు రైతులకు పంట నష్టం వాటిల్లకుండా వంతుల వారీ విధానంలో సాగునీరు సరఫరా చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ స్పష్టం చేశారు. స్థానిక కలెక్టరేట్ నుంచి సోమవారం మండల స్థాయి వరకు వ్యవసాయ అధికారులు, జలవనరుల ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 14 లోపు వరి నాట్లు వేసే రైతులందరికీ వంద శాతం పంటల బీమా వర్తింపజేయాలన్నారు. పంపా రిజర్వాయర్‌లో నీటి లభ్యత లేనందున, వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగును రైతులు చేపట్టేలా ప్రోత్సహించాలన్నారు. పెద్దాపురం, పిఠాపురం తదితర ప్రాంతాల్లో సాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలన్నారు
మాజీ ఎమ్మెల్సీ
లక్ష్మీశివకుమారి భర్త మృతి
రౌతులపూడి: ఎ.మల్లవరం గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంగూరి లక్ష్మీశివకుమారి భర్త అంగూరి బాలకృష్ణ సోమవారం మృతి చెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఎ.మల్లవరంలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు తన ప్రగాఢ సంతాపాన్ని లక్ష్మీశివకుమారి కుటుంబ సభ్యులకు తెలిపారు. ప్రస్తుతం కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో వీఆర్వోగా సేవలందిస్తున్న బాలకృష్ణ అంతకుముందు వలసపాకల, రౌతులపూడి మండలం గంగవరం, జల్దాం గ్రామ వీఆర్వోగా పని చేశారు. ఆయనకు భార్య లక్ష్మీశివకుమారి, ముగ్గురు కుమారులు ఉన్నారు.
జిల్లాలో 34 కేంద్రాల్లో
బియ్యం అమ్మకాలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాల్లో బియ్యం అమ్మకాలను నిర్వహిస్తున్నట్లు జేసీ అపూర్వ భరత్ తెలిపారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న రైతు బజార్‌లో బియ్యం విక్రయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.
క్రమంగా తగ్గుతూ..
ధవళేశ్వరం: స్థానిక కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతుంది. సోమవారం తెల్లవారుజామున 13.70 అడుగులకు నీటిమట్టం చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సాయంత్రానికి 11.70 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను సైతం వెనక్కి తీసుకున్నారు. నీటి ఉధృతి మరింత తగ్గుతూ రాత్రి 8 గంటలకు 11.30 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 9,36,808 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి మంగళవారం మరింత తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువన కాళేశ్వరంలో 8.31, పేరూరులో 13.07, దుమ్ముగూడెంలో 10.08 మీటర్లు, భద్రాచలంలో 35.20 అడుగులు, కూనవరంలో 17.19 మీటర్లు, కుంటలో 8.31, పోలవరంలో 11.52, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.83 మీటర్లుగా గోదావరి నీటిమట్టాలు నమోదయ్యాయి.
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్
పోటీలకు ఎంపిక
రౌతులపూడి: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఈ నెల 11 నుంచి 13 వరకు చిత్తూరులో జరిగే సౌత్ జోన్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని హెచ్‌ఎం కె.రాంబాబు తెలిపారు. పదో తరగతి చదువుతున్న గండ్రెడ్డి వెంకటరిషి, గొరకపూడి అభినయ్, ఎనిమిదో తరగతి విద్యార్థిని వెలుగు ఈశ్వరి వెంకటదేవిశ్రీలు కాకినాడలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో విజయం సాధించి, రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు ఆయన వెల్లడించారు. విజేతలకు సంకల్పం సేవా సంస్థ అధినేత రూ.1,500 ఆర్థిక సహకారం అందించారు.


