● బరువెక్కిన బడి సంచి
● చిన్న వయసులోనే పెద్ద జబ్బులు
● బాల్యంలోనే నడుం నొప్పులు
● ప్రత్యామ్నాయంపై
దృష్టి పెడితేనే పరిష్కారం
బడి సంచి బరువెక్కింది.. సవాలక్ష పుస్తకాలతో మోయలేని భారం పడుతోంది.. కిలోల కొద్దీ పుస్తకాలు మోయలేక, వెన్నెముక మధ్యలో వంగిపోతుంది. బాల్యం రోగాల బారిన పడాల్సి వస్తుంది. భావిభారత పౌరుల భవితవ్యం సమస్యల్లో చిక్కుకుంటోంది. ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించకపోతే ప్రమాదకరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై అధికారులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులూ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కార్పొరేట్ మాయలో బాల్యం బక్కచిక్కిపోతోంది. మోయలేని పుస్తకాల భా రంతో ఇబ్బంది పడుతోంది. జిల్లాలో 1,879 ప్రభు త్వ, ప్రైవేటు పాఠశాలలు ఉండగా.. 2.87 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. చాలా ప్రైవేట్ స్కూళ్లలో 1–5 తరగతులకు ఎస్సీఈఆర్టీ పుస్తకాలకు తోడు సొంత మెటీరియల్ అంటగడుతున్నారు. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు జేఈఈ మెయిన్స్, నీట్ స్టడీ మెటీరియల్ అంటూ భారీగా పుస్తకాలు ఇస్తున్నారు. బండెడు పుస్తకాలను బ్యాగులో వేసుకుని నేటి బాల్యం నిత్యం నరకయాతన అనుభవిస్తోంది. రెండు నుంచి నాలుగు వరకు అంతస్తుల్లో ఉన్న తరగతులకు మెట్ల మీదుగా చేరలేక విద్యార్థులు ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. విద్యాహక్కు చట్టం – 2009, యస్పాల్ కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం స్కూల్ బ్యాగ్ పాలసీని ఆరేళ్ల కిందట అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం 1, 2 తరగతుల విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, గణితం, 3, 4, 5 తరగతులైతే ఆ మూడింటికి తోడు పరిసరాల విజ్ఞానం, 6–10 తరగతులైతే ఆరు పుస్తకాలే ఇవ్వాలి. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో తల్లిదండ్రులు మాట్లాడి.. స్కూల్ బ్యాగ్ ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టాలి. పాఠశాలలో రెండో సంచి పెట్టడం, ఏ రోజుకు అవసరమయ్యే వాటిని ఆ రోజే తెచ్చుకోవడం, హోం వర్క్ ఇచ్చిన సబ్జెక్టుల నోటు పుస్తకాలే ఇళ్లకు తీసుకెళ్లేలా చూడడం అవసరం. నో బ్యాగ్ డేను పాఠశాలల్లో విధిగా అమలయ్యేలా చూడాల్సి అవసరం ఉంది.
చట్టాలు కాగితాలకే పరిమితం
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ స్కూల్ బ్యాగ్ పాలసీ ప్రకారం ఏ తరగతి విద్యార్థి ఎంత బరువు మోయాలో స్పష్టమైన నిబంధనలు ఇచ్చింది. విద్యార్థి శరీర బరువులో 10 శాతానికి మించి స్కూల్ బ్యాగ్ బరువు ఉండకూడదనేది ప్రాథమిక సూత్రం. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ర్యాంకుల ఉచ్చు, అదనపు సిలబస్ మార్కెటింగ్ వ్యూహాల వల్ల ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కేస్తున్నారు. ప్రభుత్వాలు జీఓలు జారీ చేయడం, అధికారులు అప్పుడప్పుడూ తనిఖీలు చేయడం మినహా క్షేత్ర స్థాయిలో శాశ్వత పరిష్కారం లభించడం లేదు.
మోత బరువు.. పర్యవేక్షణ కరవు
చిన్న వయసులో అంత బరువును నిరంతరం మోయడం వల్ల విద్యార్థులు శారీరక, మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పిల్లల్లో ఆరోగ్య సమస్యలు వైద్యుల పరిశీలనలో స్పష్టమవుతున్నాయి. నిరంతరం బరువు వెనక్కి లాగడం వల్ల పిల్లలు ముందుకు వంగి నడుస్తారు. దీనివల్ల వెన్నెముక వంకర తిరగడం, చిన్న వయసులోనే స్పాండిలైటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తున్నాయి. మెడ, భుజాలు, నడుము, కండరాలు తీవ్ర ఒత్తిడికి లోనై నిరంతరం అలసట బారిన పడుతున్నారు. భారీ బ్యాగుల వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడి పడి, గాలి పీల్చుకునే సామర్థ్యం తగ్గి విద్యార్థులు త్వరగా అలసిపోతున్నారు.
తరగతి గరిష్ట బరువు సగటున మోస్తున్న బరువు
1,2 1.6 నుంచి 2.2 కిలోలు 4 నుంచి 5 కిలోలు
3,4,5 1.7 నుంచి 2.5 కిలోలు 6 నుంచి 7 కిలోలు
6,7 2 నుంచి 4.5 కిలోలు 7 నుంచి 8 కిలోలు
8,9 2.5 నుంచి 4.5 కిలోలు 9 నుంచి 12 కిలోలు
10 గరిష్టంగా 5 కిలోలు 12 నుంచి 15 కిలోలు


