పల్లెలకు పవర్‌ఫుల్‌ షాక్‌ | - | Sakshi
Sakshi News home page

పల్లెలకు పవర్‌ఫుల్‌ షాక్‌

May 15 2026 10:38 AM | Updated on May 15 2026 10:38 AM

విద్యుత్‌ బిల్లుల చెల్లింపునకు సర్కారు ‘నో’

ఫైనాన్స్‌ కార్పొరేషన్‌

సిఫారసులకు తిరస్కరణ

మైనర్‌ పంచాయతీల పైనే భారం

మినహాయింపు ఇవ్వాలని నేతల డిమాండ్‌

సాక్షి ప్రతినిధి, కాకినాడ: మైనర్‌ గ్రామ పంచాయతీలకు చంద్రబాబు సర్కారు ‘పవర్‌’ఫుల్‌ షాక్‌ ఇస్తోంది. వెయ్యి లోపు జనాభా కలిగి, అసలే అరకొర ఆదాయంతో నెట్టుకొస్తున్న చిన్న గ్రామ పంచాయతీల్లో మంచినీటి పథకాలు, వీధి దీపాలకు విద్యుత్‌ బిల్లులు చెల్లించేది తెగేసి చెప్పేసింది. ఆర్థిక ఇక్కట్లు పడుతున్న మైనర్‌ గ్రామ పంచాయతీల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనను రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చేసిన సిఫారసులను చంద్రబాబు ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. తద్వారా వీధి దీపాల నిర్వహణ ఖర్చును ఆయా గ్రామ పంచాయతీల పైకే నెట్టేసింది.

3 కేటగిరీలుగా..

ఆదాయం, జనాభా ప్రాతిపదికన గ్రామ పంచాయతీలను మేజర్‌, మైనర్‌గా విభజించారు. అనంతరం వాటిని మూడు కేటగిరీలుగా చేశారు. అన్ని విధాలా పెద్దవిగా ఉన్న గ్రామ పంచాయతీలకు గ్రేడ్‌–1, మిగిలిన వాటికి గ్రేడ్‌–2, గ్రేడ్‌–3 హోదా కల్పించారు. జిల్లాలో మొత్తం 385 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో గ్రేడ్‌–1 మేజర్‌ గ్రామ పంచాయతీలు 180 వరకూ ఉన్నాయి. మిగిలిన 205 గ్రామ పంచాయతీలు గ్రేడ్‌–2, గ్రేడ్‌–3వి. వీటిలో మైనర్‌ గ్రామ పంచాయతీల ఆదాయం అంతంత మాత్రమే. ప్రధానంగా ఇంటి పన్నులు, మంచినీటి చెరువుల గట్ల చుట్టూ ఉండే కొబ్బరి తదితర చెట్ల నుంచి వచ్చే ఫలసాయం తప్ప మరో ఆదాయ మార్గం ఉండదు. అవి కూడా లేని గ్రామ పంచాయతీలు ఆర్థికంగా నానా కష్టాలూ ఎదుర్కొంటున్నాయి.

గతంలో మినహాయింపు

మైనర్‌ గ్రామ పంచాయతీల ఆర్థిక దుస్థితిని పరిగణనలోకి తీసుకుని వాటి విద్యుత్‌ బిల్లులను ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేది. అటువంటిది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మైనర్‌ గ్రామ పంచాయతీలను దెబ్బ తీసేలా ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఒకప్పుడు చిన్న గ్రామ పంచాయతీలకు విద్యుత్‌ చార్జీల నుంచి మినహాయింపు ఉండేది. ఆయా పంచాయతీల్లో వీధి దీపాలు, మంచినీటి పథకాల విద్యుత్‌ బిల్లులు వసూలు చేయకుండా మినహాయింపు ఉండేది. మేజర్‌ గ్రామ పంచాయతీలైతే మాత్రం సొంత నిధుల నుంచి ఆ బిల్లులు చెల్లించాలి. 2014 తర్వాత చంద్రబాబు హయాంలో మేజర్‌తో పాటు మైనర్‌ గ్రామ పంచాయతీల నుంచి కూడా విద్యుత్‌ బిల్లుల వసూలుకు నోటీసులిచ్చింది. అప్పటి నుంచీ మైనర్‌ గ్రామ పంచాయతీల్లో బకాయిలు పేరుకుపోయాయని ఏపీ ఈపీడీసీఎల్‌ అధికారులు చెబుతున్నారు.

రాబడి తక్కువ.. ఖర్చు ఎక్కువ

వెయ్యి లోపు జనాభా ఉన్న మైనర్‌ గ్రామ పంచాయతీల్లో నెలకు సుమారు రూ.లక్ష వరకూ ఖర్చవుతుంది. ఉదాహరణకు కరప మండలం జెడ్‌.భావారం గ్రామ పంచాయతీలో ఇంటి పన్నుల రూపంలో రూ.60 వేలు మాత్రమే ఆదాయం వస్తుంది. పారిశుధ్య పనుల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలు ఇంతకు మించే ఉంటాయి. చాలా పంచాయతీల్లో ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో వీధి దీపాలు, తాగునీటి మోటార్ల విద్యుత్‌ బిల్లుల చెల్లింపు వాటికి మోయలేని భారమవుతోంది. పారిశుధ్య కార్మికుల జీతభత్యాలు చెల్లించడానికే ఆదాయం చాలడం లేదని, ఇక విద్యుత్‌ బిల్లుల చెల్లింపు ఏవిధంగా సాధ్యమని మైనర్‌ గ్రామ పంచాయతీల మాజీ సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యుత్‌ బిల్లుల చెల్లింపు గ్రామ పంచాయతీలకు తలకు మించిన భారం కానున్నదని చెబుతున్నారు.

ప్రభుత్వమే చెల్లించాలి

అసలే ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న గ్రామ పంచాయతీలపై విద్యుత్‌ బిల్లుల భారం మోపడం సరికాదు. వాటిని ప్రభుత్వమే చెల్లించాలి. కనీసం డ్రైనేజీల నిర్వహణకు కూడా సొమ్ము లేక చిన్న పంచాయతీలు నానా ఇబ్బందులూ ఎదుర్కొంటున్నాయి. గతంలో మైనర్‌ గ్రామ పంచాయతీలకు విద్యుత్‌ బిల్లుల చెల్లింపులో మినహాయింపునిచ్చారు. ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరించి, విద్యుత్‌ బిల్లుల భారం గ్రామ పంచాయతీలపై పడకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.

– రొక్కాల గణేష్‌, మాజీ సర్పంచ్‌,

జి.భావారం, కరప మండలం

రూ.108.69 కోట్ల బకాయిలు

జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు కలిపి గత మార్చి నెలాఖరుకు రూ.108.69 కోట్ల మేర విద్యుత్‌ బిల్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బకాయి 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.41.82 కోట్ల వరకూ ఉందని ఈపీడీసీఎల్‌ జిల్లా యంత్రాంగం చెబుతోంది. ఇందులో మైనర్‌ గ్రామ పంచాయతీల బకాయిలు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ ఉన్నాయి. గ్రేడ్‌–1 మేజర్‌ గ్రామ పంచాయతీలు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ బకాయి పడ్డాయి. మేజర్‌ గ్రామ పంచాయతీలకు వార్షిక ఆదాయం ఉంటుంది కాబట్టి వాటికి విద్యుత్‌ బిల్లుల చెల్లింపులో ఇబ్బంది లేదు. మైనర్‌ పంచాయతీలకు వచ్చేసరికి మాత్రం సొంత నిధులు లేని దుస్థితి. ఇటు కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేని పరిస్థితుల్లో ఉన్న తమ విద్యుత్‌ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని మైనర్‌ పంచాయతీల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement