బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రభుత్వ కళాశాలల్లో చదువుతూ ఇంటర్మీడియెట్ ఫెయిలైన విద్యార్థులతో పాటు, ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులై, తక్కువ మార్కులు పొంది, ఇంప్రూవ్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్న వారికి అధికారులు ప్రత్యేక పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంటర్‌లో ఉత్తీర్ణత శాతం పెంచడమే లక్ష్యంగా ఆయా కళాశాలల్లో ఈ ప్రత్యేక తరగతులు ప్రారంభించారు. ఈ నెల 21 నుంచి జూన్ నాలుగో తేదీ వరకూ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.
ఇదీ పరిస్థితి
జిల్లా వ్యాప్తంగా 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్లస్ టు హైస్కూల్ ప్లస్ 14, మోడల్ స్కూళ్లు 2, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు 4, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలు 8, ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలలు 4 ఉన్నాయి. ఈ కళాశాలల నుంచి ఫస్టియర్ జనరల్ విభాగంలో 2,045 మంది పరీక్షలు రాయగా 836 మంది.. ఒకేషనల్ విభాగంలో 912కు 548 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్ జనరల్ విభాగంలో 1,690 మందికి 879 మంది.. ఒకేషనల్ విభాగంలో 645కు 503 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్ విద్యార్థులు తమ మార్కులు పెంచుకునేందుకు వీలుగా పరీక్షలకు హాజరయ్యేందుకు తొలిసారిగా ఈ ఏడాది ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. ఇంటర్‌లో సాధించిన మార్కులు ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీటు సాధించేందుకు కీలకం కానున్నాయి. ఇంటర్ రెండేళ్లు కలిపి ఎస్సీ, ఎస్టీలకు 65 శాతం, ఓసీ, బీసీ, ఓబీసీ తదితరులు 75 శాతం మార్కులు సాధిస్తే ఈ వెయిటేజీ ఉత్తమ కోర్సుల్లో చేరేందుకు ఉపయోగపడుతుంది. కొందరు విద్యార్థులు జేఈఈలో ఉత్తీర్ణులైనప్పటికీ ఇంటర్‌లో మార్కులు తగ్గడంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. గణితం, భౌతిక, రసాయన శాస్త్రాల్లో మార్కుల ఆధారంగా ఈఏపీ సెట్‌లో 25 శాతం వెయిటేజీ పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఫెయిలైన విద్యార్థులతో పాటు ఇంప్రూవ్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలల్లో రెమిడియల్ తరగతులు నిర్వహిస్తున్నారు. సబ్జెక్టుల్లో సందేహాలు నివృత్తి చేస్తూ, మోడల్ పేపర్ల సాధన చేయిస్తున్నారు.
అధ్యాపకుల ఆగ్రహం
ఇప్పటికే 40 శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లను వివరణ కోరుతూ ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అటు ప్రిన్సిపాల్స్, ఇటు అధ్యాపకుల సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈవిధంగా వివరణ కోరడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నిస్తున్నారు. పైగా, ఉత్తీర్ణత శాతం పెంచాలంటూ ప్రత్యేక తరగతులు సైతం నిర్వహించాలని మళ్లీ ఆదేశాలు జారీ చేయడంపై మండిపడుతున్నారు. అసలే వేసవి ఉష్ణోగ్రతలు పెరగడంతో వయస్సు ఫైబడిన అధ్యాపకులు అవస్థలు పడుతున్నారు.
ఫ ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు
పునశ్చరణ తరగతులు
ఫ ఇంప్రూవ్‌మెంట్‌కు
దరఖాస్తు చేసిన వారికీ అవకాశం


