● వైఎస్సార్ సీపీ ఉద్యమంతో
దిగి వచ్చిన ప్రభుత్వం
● మసీదు మాన్యంలో ఆయుష్
కళాశాల నిర్మాణం నిలిపివేత
● ఇతర స్థలాల పరిశీలన
పిఠాపురం: పేదలకు గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల పరిరక్షణకు వైఎస్సార్ సీపీ చేసిన పోరాటం ఫలించింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పిఠాపురం మసీదు మాన్యంలో జగనన్న కాలనీ లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. అక్కడ పేదల ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకునే లోపు ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. తరువాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ స్థలాల్లో లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి దాదాపు రెండేళ్లుగా ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. దీనిపై లబ్ధిదారులు పలుమార్లు అధికారులకు అర్జీలు అందజేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోగా.. అదే స్థలంలో ఆయుష్ కళాశాల నిర్మాణానికి ప్రయత్నించింది. దీనిని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యాన వందలాదిగా లబ్ధిదారులు ఇటీవల ఆ స్థలంలో ఆందోళన నిర్వహించారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (పాడా) కార్యాలయానికి చేరుకుని పీడీకి వినతిపత్రం సమర్పించారు.
మసీదు మాన్యంలో పేదలకు కేటాయించిన స్థలాల జోలికొస్తే ఊరుకునేది లేదని, పేదలకు వెంటనే ఇళ్లు నిర్మించాలని, అక్కడ ఏ ఇతర నిర్మాణం చేపట్టినా అడ్డుకుంటామని, లబ్ధిదారులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని ఆ సందర్భంగా గీత హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన చంద్రబాబు.. ఆ దిశగా ఎటువంటి చర్యలూ తీసుకోకపోగా.. గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన స్థలాలను లాక్కొనే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కాకినాడలో నిర్మించిన ఆయుష్ ఆసుపత్రి పక్కనే స్థలాలున్నప్పటికీ.. లేదని చెబుతూ, పిఠాపురంలో పేదలకు కేటాయించిన స్థలాల్లో ఆయుష్ కళాశాల నిర్మాణం చేపట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఏదైనా వైద్య కళాశాల నిర్మించాలంటే పక్కనే ఆసుపత్రి కూడా ఉండాలన్న కనీస నిబంధన కూడా పాటించకుండా ఎక్కడో 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిఠాపురంలో కళాశాల నిర్మించాలని చూడటం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. కాకినాడలోని విలువైన స్థలాన్ని టీడీపీ నేతకు కట్టబెట్టేందుకే ఇక్కడ పేదల స్థలాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సమస్యపై కలెక్టర్‌కు, ఇతర అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా సిద్ధమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మసీదు మాన్యం స్థలాన్ని పేదలకే వదిలేసి, వేరే చోట ఆయుష్ కళాశాల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోంది. ఆ దిశగా అధికారులు ఇప్పటికే వేరే స్థలాలు పరిశీలిస్తున్నారు. పిఠాపురం మండలం చిత్రాడలోని వివిధ స్థలాలను కలెక్టర్ ఎంఎన్ హరీంధిర ప్రసాద్ ఇటీవల పరిశీలించారు. కళాశాల నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలి
మసీదు మాన్యం వద్ద జగనన్న కాలనీకి కేటాయించిన భూమిలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించి, రోడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించి, వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలి. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేంత వరకూ వారి తరఫున పోరాటం కొనసాగిస్తాం. నర్సింగపురంలో కూడా పేదలకు కేటాయించిన స్థలాలను ఇతరులకు ఇవ్వకుండా, ఇళ్ల నిర్మాణం చేపట్టాలి.
– వంగా గీతా విశ్వనాథ్, వైఎస్సార్ సీపీ
నియోజకవర్గ ఇన్‌చార్జి, పిఠాపురం
అక్కడ కళాశాల నిర్మాణం లేనట్టే..
మసీదు మాన్యంలో ఆయుష్ కళాశాల నిర్మాణం లేనట్టే. ఈ మేరకు కోర్టుకు కూడా నివేదించారు. అందుకే ఇతర స్థలాలను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో కళాశాల నిర్మాణానికి వేరే స్థలం సేకరించి ఇవ్వనున్నారు. – కె.రామచంద్రారెడ్డి,
డిప్యూటీ తహసీల్దార్, పిఠాపురం


