హైవేలో 18 బ్లాక్‌ స్పాట్లు | - | Sakshi
Sakshi News home page

హైవేలో 18 బ్లాక్‌ స్పాట్లు

May 15 2026 10:38 AM | Updated on May 15 2026 10:38 AM

ప్రమాదాల తగ్గింపునకు చర్యలు

ఐజీ అశోక్‌ కుమార్‌

గండేపల్లి: జగ్గంపేట నియోజకవర్గంలో 16వ నంబర్‌ జాతీయ రహదారిపై తరచుగా ప్రమాదాలు జరుగుతున్న 18 బ్లాక్‌ స్పాట్లను గుర్తించినట్టు ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌ కుమార్‌ తెలిపారు. గండేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఆయన వార్షిక తనిఖీలు చేశారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో హైవేపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. బ్లాక్‌ స్పాట్ల వద్ద తగిన చర్యలు తీసుకునేవిధంగా హైవే అధికారులతో మాట్లాడామని చెప్పారు. త్వరలో రహదారి విస్తరణ పనులు ప్రారంభమయ్యే అవకాశముందని, తద్వారా ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అన్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నేపథ్యంలో తగిన భద్రతా చర్యలు తీసుకుంటామన్నారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులను, వారి వాహనాలను మాత్రమే రాజమహేంద్రవరం నగరంలోనికి అనుమతిస్తామని, ఇతర వాహనాలను దారి మళ్లిస్తామని తెలిపారు. బాల్య వివాహాలను నివారిస్తామన్నారు. చోరీలకు కళ్లెం వేసేందుకు సీసీ కెమెరాలను పెంచి, పాత నేరస్తులపై నిఘా పెంచుతామని ఐజీ చెప్పారు. రేంజి పరిధిలోని ఆరు జిల్లాల్లో అవసరమైన చోట్ల సుమారు 25 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్య నాయకుల విగ్రహాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. హైవేపై పెట్రోలింగ్‌ పెంచుతామని, కొత్త వాహనాన్ని అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసు సిబ్బందికి త్వరలో విధులు అప్పగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా హెల్మెట్‌ వాడకంపై సిబ్బందికి, వాహనదారులకు ఐజీ అశోక్‌ కుమార్‌ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్‌, పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్‌, జగ్గంపేట సీఐ బి.తిరుపతి, ఎస్సైలు యూవీ శివ నాగబాబు, టి.రఘునాథరావు, సతీష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

కొనసాగిన ఈఏపీ సెట్‌

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీ సెట్‌ మూడో రోజైన గురువారం కూడా కొనసాగింది. జిల్లాలోని ఐదు ఆన్‌లైన్‌ కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 830 మంది హాజరవగా 33 మంది గైర్హాజరయ్యారు. ఉదయం పరీక్షకు 329 మంది హాజరయ్యారని, మధ్యాహ్నం పరీక్షకు 501 మంది హాజరు కాగా, 24 మంది గైర్హాజరయ్యారని కన్వీనర్‌ మోహనరావు తెలిపారు. జేఎన్‌టీయూకేలోని కార్యాలయం నుంచి ఏపీ ఈఏపీ సెట్‌ చైర్మన్‌, జేఎన్‌టీయూకే ఉప కులపతి ఆచార్య సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ ఆన్‌లైన్‌లో పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement