అన్నవరం: ఎండలు మండిపోతున్నా రత్నగిరిపై భక్తుల సందడి ఏమాత్రం తగ్గడం లేదు. సూర్యుడు 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో చెలరేగుతున్నా.. భక్తులు ఏమాత్రం లెక్క చేయడం లేదు. అచంచల భక్తిభావంతో సత్యదేవుని దర్శనానికి వారం రోజులుగా వేలాదిగా తరలివస్తూనే ఉన్నారు. వారం రోజులుగా వివాహలు జోరుగా జరుగుతూండటంతో నవదంపతులు, వారి బంధుమిత్రులతో పాటు సాధారణ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తూండటంతో ఆలయం కిటకిటలాడుతోంది. సుమారు 40 వేల మంది భక్తులు గురువారం సత్యదేవుని దర్శనానికి వచ్చారు. దీంతో, క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారాయి. వ్రతాలాచరించేందుకు సైతం భక్తులు బారులు తీరారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, ప్రదక్షిణ చేశారు. సత్యదేవుని వ్రతాలు రెండు వేలు జరిగాయి. అన్ని విభాగాల నుంచి దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.
వాడపల్లి వెంకన్నకు
రికార్డు స్థాయి ఆదాయం
– 50 రోజులకు రూ 3.24 కోట్లు
ఆత్రేయపురం : కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి హుండీల ద్వారా 50 రోజులకు రూ.3,24,82,615 ఆదాయం లభించినట్లు ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. దేవదాయ శాఖ జిల్లా అధికారి వి.సత్యనారాయణ, రాజమహేంద్రవరం తనిఖీదారు ఎస్‌టీపీటీ శ్రీనివాస్, గ్రూపు దేవాలయాల ఈఓలు పీవీవీఎస్ కామేశ్వరరావు, ఎం.సత్యనారాయణల సమక్షంలో గురువారం హుండీల ఆదాయం లెక్కించారు. శ్రీ విశ్వేశ్వరస్వామి హుండీలతో కలిపి రూ.2,44,76,932, అన్న ప్రసాదం హుండీల ద్వారా రూ.80,05,683 మేర ఆదాయం లభించిందని ఈఓ వివరించారు. బంగారం 73 గ్రాములు, వెండి 1,544 గ్రాములు, 14 దేశాలకు చెందిన 51 కరెన్సీ నోట్లు లభించాయని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు, అర్చకులు, వేద పండితులు, శ్రీవారి సేవకులు, రావులపాలెం కరూర్ వైశ్యా బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.


