కొనసాగిన ఏసీబీ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగిన ఏసీబీ తనిఖీలు

Jan 31 2026 7:14 AM | Updated on Jan 31 2026 7:14 AM

కొనసా

కొనసాగిన ఏసీబీ తనిఖీలు

కడియం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రెండో రోజూ పరిశీలన

కడియం: స్థానిక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రెండో రోజు శుక్రవారం కూడా ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగాయి. ఏసీబీ డీఎస్పీ ఎం.కిశోర్‌కుమార్‌ ఆధ్వర్యంలో సిబ్బంది ఈ తనిఖీలు నిర్వహించారు. గురువారం సబ్‌ రిజిస్ట్రార్‌ ఎప్పిలి లక్ష్మి టేబుల్‌లో రూ.79 వేలు, సమీపంలోని డాక్యుమెంట్‌ రైటర్ల వద్ద రూ. 1,03,210 స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. రాత్రి 8.30 గంటలకు వచ్చిన ఏసీబీ అధికారులు కార్యాలయాన్ని తమ అదుపులోకి తీసుకుని పొద్దుపోయే వరకూ తనిఖీలు చేశారు. తిరిగి శుక్రవారం ఉదయం రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీతో సహా, జిల్లా సిబ్బంది కార్యాలయానికి వచ్చి గత కొన్ని రోజులుగా రిజిస్టర్‌ అయిన డాక్యుమెంట్లను పరిశీలించారు. త్వరలో డీఆర్‌గా పదోన్నతి పొందనున్న ఎప్పిలి లక్ష్మిపై ఏసీబీ తనిఖీలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

రూ.2.62 కోట్లకు గండి

కడియం సబ్‌ రిజిస్ట్రార్‌ (ఎస్‌ఆర్‌ఓ) ఎప్పిలి లక్ష్మి కారణంగా రూ. 2.62 కోట్లకు పైగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ కిశోర్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం కూడా రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో తమ సిబ్బందితో కలసి తనిఖీలు కొనసాగించామని అన్నారు. తక్కువ వాల్యూతో డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్‌ చేయడం కారణంగా ప్రభుత్వానికి రూ.2.62 కోట్ల నష్టం వచ్చిందని ఈ తనిఖీల్లో గుర్తించామని ఆయన తెలిపారు. అలాగే జనవరి 28, 29వ తేదీల్లో మొత్తం 144 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ చేయగా, ఇందులో 107 డాక్యుమెంట్లు సంబంధిత కక్షిదారులకు ఇవ్వకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎస్‌ఆర్‌ఓ దగ్గరే ఉంచుకున్నారన్నారు. 2025లో మొత్తం 911 డాక్యుమెంట్లు రిజిస్టర్‌ కాగా, వీటికి సపోర్టింగ్‌ డాక్యుమెంట్లు సక్రమంగా లేవన్నారు. గతంలో ఆమె పనిచేసిన చోట్ల కూడా తక్కువ విలువ కారణంగా ప్రభుత్వానికి రూ.95 లక్షల నష్టం కలిగించినట్లు కూడా తమ విచారణలో వెల్లడైందని డీఎస్పీ వెల్లడించారు. ఇంకా విచారణ కొనసాగుతోందని, పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలియజేస్తామన్నారు. కాగా శుక్రవారం రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. లేఖర్ల నుంచి స్టేట్‌మెంట్లు రికార్డు చేసుకున్నారు. అలాగే రెండు రోజులుగా జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కక్షిదారులను కూడా పిలిపించి, వారి నుంచి కూడా ఏసీబీ అధికారులు వివరాలు ఆరా తీశారు. కాగా కడియం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీల విషయం తెలుసుకుని పలువురు బాధితులు అక్కడికి చేరుకుని తమ ఫిర్యాదులను అధికారులకు వివరించడం గమనార్హం.

కొనసాగిన ఏసీబీ తనిఖీలు 1
1/1

కొనసాగిన ఏసీబీ తనిఖీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement