ఉచితం..పరిమితం
● కొంత మందికే ఉచిత గ్యాస్ సిలిండర్
● జిల్లాలో తెల్ల రేషన్ కార్డులు
6.50 లక్షలు
● సగం మందికి కూడా అందని
ఉచిత వంట గ్యాస్
● అర్హత ఉన్నా అందడం లేదని
లబ్ధిదారుల గగ్గోలు
● గ్యాస్ ఏజెన్సీల చుట్టూ ప్రదక్షిణలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): అధికారంలోకి వస్తే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత మొక్కుబడిగా కొంత మందికే ఇస్తూ చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో 6.50 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులున్నారు. వీరు సిలిండర్ బుక్ చేసుకున్న వెంటనే ఆయా గ్యాస్ ఏజెన్సీలకు నగదు చెల్లిస్తున్నారు. ఆ తరువాత చాలా రోజులకు గానీ ప్రభుత్వం ఆ సొమ్మును వారి ఖాతాలకు చెల్లించడం లేదు. అది కూడా కొంత మందికే వస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. నలుగురు సభ్యులున్న కుటుంబానికి దాదాపు ప్రతి నెలా ఒక సిలిండర్ అయిపోతుంది. కానీ, ప్రతి నాలుగు నెలలకు ఒకటి చొప్పున మాత్రమే ఉచితంగా ఇస్తోంది. ఈవిధంగా ఏడాదికి మూడు చొప్పున లబ్ధిదారులకు ప్రభుత్వం ఇప్పటి వరకూ ఆరు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాల్సి ఉంది. కానీ, మూడు సిలిండర్లు మాత్రమే అందించింది. అది కూడా కొంతమందికే ఇచ్చి చేతులు దులుపుకుంటోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఈ పథకానికి అర్హులైన లబ్ధిదారుల్లో కొంత మందికి ఒకసారి, మరి కొంత మందికి రెండుసార్లు మాత్రమే ఇప్పటి వరకూ ఉచిత సిలిండర్లు అందాయంటే ఈ పథకం ఏవిధంగా అమలవుతోందో అర్థం చేసుకోవచ్చు. చాలా మంది లబ్ధిదారులు తమకు ఉచిత సిలిండర్ల నగదు జమ కావడం లేదని గగ్గోలు పెడుతున్నారు. దీనిపై అధికారులకు, ఆయా గ్యాస్ ఏజెన్సీలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఒక్క రూపాయి కూడా వారి ఖాతాల్లో జమ కావడం లేదు. లబ్ధిదారులు ఆయా గ్యాస్ ఏజెన్సీల్లో స్వయంగా వేలిముద్రలు వేస్తున్నా.. బ్యాంకు ఖాతా వంటివన్నీ సరి చేసుకున్నా కూడా నగదు జమ కావడం లేదు. తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసినా ఎటువంటి ఉపయోగం లేదు.
లబ్ధిదారుల్లో కోత
ప్రభుత్వం 2024 నవంబర్ నెలలో ఈ పథకాన్ని ప్రారంభించగా, లబ్ధిదారుల సంఖ్యలో గణనీయంగా కోత పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పథకాన్ని ప్రారంభించిన 2024 నవంబర్ నుంచి 2025 ఫిబ్రవరి వరకూ నాలుగు నెలల వ్యవధిలో 4.36 లక్షల మందికి ఉచిత సిలిండర్లకు సంబంధించిన నగదు జమ చేశారు. రెండో విడతలో గత ఏడాది మార్చి నుంచి జూన్ నెలల మధ్య ఆ సంఖ్య 4.38 లక్షలకు పెరిగింది. మూడో విడతలో 3.86 లక్షల మందికి మాత్రమే ఉచిత సిలిండర్ల నగదు జమ అయ్యింది. లబ్ధిదారుల సంఖ్యను ప్రభుత్వం గణనీయంగా తగ్గించడంతో వేలాది మంది తమ గ్యాస్ నగదు పడలేదంటూ పౌర సరఫరాల శాఖ అధికారులకు, తహసీల్దార్ కార్యాలయాలకు తరచూ ఫిర్యాదు చేస్తున్నారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో లబ్ధిదారులు ప్రభుత్వం తమను మోసం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కసారీ ఇవ్వలేదు
నాకు తెల్ల రేషన్ కార్డు ఉంది. అయినప్పటికీ ఒక్కసారి కూడా నా ఖాతాలో గ్యాస్ నగదు జమ కాలేదు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. తెల్ల రేషన్ కార్డు ఉంటే ఉచిత గ్యాస్ ఇస్తామని ఎన్నికల్లో చెప్పారు. ఆ హామీ నమ్మి మేము ఓట్లు వేశాం. ఇప్పుడు ఇలా మోసం చేయడం ప్రభుత్వానికి తగదు.
– ప్రభాకరమూర్తి, తమ్మవరం,
కాకినాడ రూరల్ మండలం
సాంకేతిక సమస్య అంటున్నారు
గత ఏడాది నుంచి మాకు ఉచిత గ్యాస్ వర్తించడం లేదు. దీనిపై గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి పలుమార్లు ఫిర్యాదు చేశాను. అక్కడి సిబ్బంది సాంకేతిక సమస్య అని, త్వరలో జమవుతుందని చెబుతున్నారు. ప్రతి రెండు నెలలకోసారి గ్యాస్ బుక్ చేస్తున్నాను. ఒక్కసారి కూడా నాకు ఉచిత సిలిండర్ నగదు జమ కాలేదు.
– మలిశెట్ల మంగ, గాంధీనగర్, కాకినాడ
ఉచితం..పరిమితం
ఉచితం..పరిమితం
ఉచితం..పరిమితం


