నిత్య కల్యాణ గోవిందా..
వాడపల్లి క్షేత్రం భక్తజన సంద్రం
కొత్తపేట: నిత్యకల్యాణ.. గోవిందా.. నీరజ నాభ గోవిందా.. అంటూ వాడపల్లి వెంకన్నను స్మరిస్తూ భక్తులు తన్మయులయ్యారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం శనివారం అశేష భక్తజనంతో కిక్కిరిసింది. సంక్రాంతి సెలవుల కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి భక్తులు ఈ క్షేత్రానికి తరలివచ్చారు. కోరిన కోర్కెలు తీరిన అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన చేరుకున్నారు. ప్రధానార్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఉదయం సుప్రభాత సేవ నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా సుగంధభరిత పుష్పాలతో అలంకరించారు. శ్రీ వేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు మాడ వీధుల్లో ఇసుక వేస్తే రాలని రీతిలో కిక్కిరిసి, అడుగులో అడుగు వేస్తూ ఏడు ప్రదక్షిణలు పూర్తి చేశారు. వేలాది మంది భక్తులతో క్యూలు నిండిపోయాయి. దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలోని అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని భక్తులు దర్శించుకున్నారు. ఉచిత వైద్య శిబిరాల్లో పలువురు భక్తులకు వైద్య సేవలు అందించారు. ఉచిత వాహనాల్లో వృద్ధులు, దివ్యాంగులను, గర్భిణులను తమ వాహనాల నుంచి ఆలయం వరకు, దర్శనానంతరం తిరిగి వాహనాల వద్దకు చేరవేశారు. ఏర్పాట్లను దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తదితరులు పర్యవేక్షించారు.
బాలబాలాజీకి
రూ.8.16 లక్షల ఆదాయం
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామికి శనివారం రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. సంక్రాంతి పండగ నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శ్రీదేవి, భూదేవి సమేతుడైన బాలబాలాజీ స్వామిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించారు. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ.8,16,073 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 24 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, 8,500 మంది స్వామి వారి అన్నప్రసాదం స్వీకరించారని చెప్పారు. నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.90,397 విరాళాలు వచ్చాయన్నారు. మండపేటకు చెందిన మాకే ఏసుదాసు, కుటుంబ సభ్యులు అన్నప్రసాద ట్రస్టుకు రూ.50,049 విరాళం అందించారు.
‘సీ్త్రలు ఇకపై
రహస్యాలను కాపాడలేరు’
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘కర్ణుడి జన్మ రహస్యాన్ని తల్లి కుంతీదేవి గోప్యంగా ఉంచడం వల్ల, నేను అన్నను చంపుకొని తీవ్ర శోకానికి గురయ్యాను. ఇకపై సర్వలోకాల్లో సీ్త్రలు రహస్యాలను కాపాడజాలరు’ అంటూ ధర్మరాజు శపించాడని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. వ్యాస భారత ప్రవచనంలో భాగంగా స్థానిక హిందూ సమాజంలో శనివారం ఆయన శాంతి పర్వంలోని పలు అంశాలను వివరించారు. ‘‘రాజ్యపాలనకు విముఖత చూపిన ధర్మరాజు మహర్షుల, సోదరుల అభ్యర్థన మేరకు పట్టాభిషిక్తుడవుతాడు. పవిత్ర జలాలు నిండిన శంఖంతో ధర్మరాజును కృష్ణపరమాత్మ అభిషేకిస్తాడు. అందరూ ధృతరాష్ట్రుని ఆజ్ఞను పాటించాలని, పూర్వం ఆయన ఎటువంటి గౌరవం పొందేవాడో, అదే గౌరవం కొనసాగాలని, ఆయనే కురురాజ్యానికి నాథుడని ధర్మరాజు ప్రకటిస్తాడు. ఆయన వ్యక్తిత్వం అంతటి ఉన్నతమైనది. భారతాన్ని మూడు భాగాలుగా చూడాలి. ఆది, సభా, వన, విరాట, ఉద్యోగ పర్వాలకు ఆది పంచకమని పేరు. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, సీ్త్ర పర్వాలకు యుద్ధ షట్కమని పేరు. ఇక శాంతి, అనుశాసన, అశ్వమేఽధిక, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వాలకు శాంతి సప్తకమని పేరు ఉంది’’ అని సామవేదం వివరించారు. యుద్ధపర్వాలకు కౌరవపక్ష నాయకుల పేర్లు మాత్రమే ఉండటానికి గల కారణాలను వివరించారు. పాండవ పక్షాన యుద్ధం ఆది నుంచి అంతం వరకు దృష్టద్యుమ్నుడే సర్వసైన్యాధ్యక్షుడని, కౌరవుల పక్షాన వారు మారుతూ వచ్చారని చెప్పారు. మనిషికి సాధారణంగా స్వప్న, సుషుప్తి, నిద్రావస్థలు మాత్రమే తెలుసునని, వీటిని మించిన తురీయావస్థ గొప్ప యోగులకే సాధ్యమని సామవేదం అన్నారు.
నిత్య కల్యాణ గోవిందా..


