అదిగదిగో అన్నప్రసాద భవనం
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని నిత్యాన్నదాన భవనానికి ఎట్టకేలకు బోర్డు ఏర్పాటు చేశారు. ‘సత్యదేవుని నిత్య అన్నప్రసాద భవనము’ అనే పేరు అందరికీ కనిపించే విధంగా ఆ భవనం మీద బోర్డు ఏర్పాటు చేయడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. సత్యదేవుని దర్శించిన భక్తులు స్వామివారి అన్నప్రసాద భవనంలో భోజనం చేయాలని భావిస్తారు. అయితే, అన్నప్రసాద భవనంపై అటువంటి బోర్డు ఇప్పటి వరకూ లేకపోవడంతో కొత్తగా వచ్చేవారు తికమకపడేవారు. పైగా, ఈ భవనం ఎక్కడుందో తెలిపే సైన్ బోర్డులు దేవస్థానంలో ఎక్కడా ఉండేవి కావు. దీంతో, భక్తులు దేవస్థానం సిబ్బందిని, అక్కడి వ్యాపారులను అడిగి అన్నప్రసాద భవనం గురించి తెలుసుకోవలసి వచ్చేది. అలాగే, స్వామివారిని దర్శించి, పశ్చిమ రాజగోపురం వెలుపలకు వచ్చిన భక్తులకు ఎదురుగా అన్నప్రసాద భవనం ఉన్నా దానిపై బోర్డు లేక అందరినీ అడగాల్సి వచ్చేది. ఈ సమస్యపై ‘దారి చూపండి స్వామీ!’ శీర్షికన గత మంగళవారం ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు స్పందించి, వెంటనే బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఈ భవనంపై శనివారం బోర్డు ఏర్పాటు చేశారు.
అధికారుల్లో కదలిక తెచ్చిన ‘సాక్షి’ కథనం
అదిగదిగో అన్నప్రసాద భవనం
అదిగదిగో అన్నప్రసాద భవనం


