తొలి తిరుపతి.. భక్తజనవాహిని
పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలంలోని తిరుపతి గ్రామంలో శనివారం భక్తజనవాహిని పరవళ్లు తొక్కింది. ఇక్కడ స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి వేలాదిగా భక్తులు పోటెత్తారు. సంక్రాంతి సెలవులు కావడంతో బంధువుల ఇళ్లకు వచ్చిన వారు స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయం కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే అనేక మంది భక్తులు కాలి నడకన ఆలయానికి చేరుకుని, స్వామిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.2.35,510, అన్నదాన విరాళాలు రూ.1,53,367, కేశఖండనకు రూ.2,800, తులాభారం ద్వారా రూ.700, లడ్డూ ప్రసాద విక్రయం ద్వారా రూ.23,655 కలిపి మొత్తం రూ.4,16,032 ఆదాయం సమకూరిందని వివరించారు. సుమారు 10 వేల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారన్నారు. ధనుర్మాసం ముగింపును పురస్కరించుకుని ధ్వజస్తంభంతో పాటు ఆలయ ప్రాంగణాన్ని పూలతో శోభాయమానంగా అలంకరించారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయంలో భజనలు, కోల సంబరం నిర్వహించారు. అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించారు.


