అన్ని దారులూ అన్నవరానికే..
● సంక్రాంతి సెలవులు ముగుస్తూండటంతో తరలివస్తున్న భక్తులు
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది
● రూ.40 లక్షల ఆదాయం
అన్నవరం: వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో అన్నవరం పుణ్యక్షేత్రం కిటకిటలాడింది. సంక్రాంతి పండగకు స్వస్థలాలకు వచ్చిన ప్రజలు సెలవులు ముగుస్తూండటంతో సత్యదేవుని దర్శనానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో శనివారం ఇతర భక్తులు కూడా వేలాదిగా స్వామివారి సన్నిధికి తరలి రావడంతో ఆలయంలో తీవ్ర రద్దీ ఏర్పడింది. పార్కింగ్ ప్రదేశాలన్నీ భక్తుల వాహనాలతో నిండిపోయాయి. దేవస్థానం ఘాట్ రోడ్డు, అన్నవరం మెయిన్ రోడ్డులో పలుమార్లు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట పట్టింది. సత్యదేవుని వ్రతాలు 2 వేలు జరిగాయి. వ్రతాలాచరించే భక్తులతో మండపాలన్నీ నిండిపోయాయి. దీంతో, మిగిలిన భక్తులు వ్రతాలాచరించేందుకు ఎండలోనే నిలుచోవలసి వచ్చింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.35 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో 8 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు.
భక్తుల అసంతృప్తి
తీవ్రమైన రద్దీ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ టికెట్టు తీసుకున్న వారికి ఉచిత దర్శనం భక్తులతో పాటే దర్శనానికి అనుమతించారు. దీనిపై అంతరాలయ దర్శనం టికెట్టు తీసుకున్న భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నప్పుడు తరచుగా అంతరాలయ దర్శనం టికెట్లు విక్రయించడం లేదు. దీనివలన దేవస్థానానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. గతంలో రూ.300 టికెట్టుతో గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ దర్శనం ఉండేది. దీనిని రూ.200 టికెట్టుతో అంతరాలయ దర్శనంగా మార్చారు. ఫలితంగా కొంత ఆదాయం తగ్గింది. ఇప్పుడు ఆ టికెట్ల విక్రయం కూడా నిలిపివేస్తూండటంతో దేవస్థానం ఆదాయం కోల్పోతోందనే విమర్శ వినిపిస్తోంది.
ఘనంగా ప్రాకార సేవ
సత్యదేవుడు, అమ్మవారికి తిరుచ్చి వాహనంపై ఆలయ ప్రాంగణంలో ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని గత నెల 16 నుంచి ఈ నెల 16వ తేదీ వరకూ అన్నవరం గ్రామ వీధుల్లో స్వామి, అమ్మవారిని ఊరేగించడంతో గత నాలుగు శనివారాలూ ప్రాకార సేవ నిర్వహించలేదు. ధనుర్మాసోత్సవాలు ముగియడంతో శనివారం దీనిని పునఃప్రారంభించారు. వచ్చే ధనుర్మాసం వరకూ ప్రతి శనివారం ఈ సేవ కొనసాగుతుంది.
నేడు కూడా రద్దీ
రత్నగిరిపై ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగనుంది. ఆలయ ప్రాంగణంలో నేటి ఉదయం పది గంటలకు స్వామివారి రథ సేవ జరుగుతుంది. అలాగే, ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ వనదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యంగిర హోమం నిర్వహిస్తారు.
సత్యదేవుని దర్శనానికి క్యూలో నిల్చున్న భక్తులు
అన్ని దారులూ అన్నవరానికే..
అన్ని దారులూ అన్నవరానికే..


