పండగల్లో.. ఫుల్‌ కిక్కు | - | Sakshi
Sakshi News home page

పండగల్లో.. ఫుల్‌ కిక్కు

Jan 18 2026 7:00 AM | Updated on Jan 18 2026 7:00 AM

పండగల్లో.. ఫుల్‌ కిక్కు

పండగల్లో.. ఫుల్‌ కిక్కు

పూటుగా తాగిన లిక్కర్‌ ప్రియులు

భారీగా విక్రయాలు

డిసెంబరు 31న అమ్మకాలు రూ.20 కోట్లు

సంక్రాంతికి రూ.21.09 కోట్లకు పెరుగుదల

కోడిపందేల బరుల వద్ద మద్యం ఏరులు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: సంక్రాంతి పండగ వచ్చిందంటే.. ముత్యాల ముగ్గులు.. కొత్త దుస్తులు.. పిండి వంటలు.. భోగి మంటలు.. వెల్లివిరిసే సంస్కృతీ సంప్రదాయాలే అందరికీ గుర్తుకొస్తాయి. కానీ, ఈసారి విచ్చలవిడిగా సాగిన కోడిపందేలు, జూద క్రీడల పుణ్యమా అని మందుబాబులు మాత్రం పూటుగా తాగి ‘ఫుల్‌ కిక్కు’తో పండగ చేసుకున్నారు. సంక్రాంతి పండగ మూడు రోజులూ జిల్లావ్యాప్తంగా మద్యం ఏరులై పారింది. పెరిగిన మద్యం అమ్మకాలే దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

మద్యం షాపుల కిటకిట

సంక్రాంతి, కనుమ పండగలను పురస్కరించుకుని గురు, శుక్రవారాల్లో డిస్టిస్టలరీలకు సెలవులు వచ్చాయి. ఈ నేపథ్యంలో పండగ మూడు రోజులూ వచ్చే మందుబాబులను దృష్టిలో ఉంచుకుని.. లిక్కర్‌ వ్యాపారులు ఈ నెల 12, 13 తేదీల్లోనే డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోలు చేసేశారు. దీంతో, పట్టణం, పల్లె అనే తేడా లేకుండా జిల్లా అంతటా మద్యం దుకాణాలు మందుబాబులతో కిటకిటలాడాయి. జిల్లాలో అధికారిక మద్యం దుకాణాల కంటే బెల్ట్‌ షాపులే మూడు రెట్లు అధికంగా ఉన్నాయి. వీటిల్లో 24/7 మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. భోగి, సంక్రాంతి, కనుమతో పాటు ముక్కనుమ రోజయిన శనివారం కూడా లిక్కర్‌ షాపులు మందుబాబులతో హడావుడిగా కనిపించాయి. దాదాపు అన్ని మద్యం దుకాణాల్లోనూ సమయంతో సంబంధం లేకుండా మద్యం విక్రయాలు విచ్చలవిడిగా నిర్వహించారు. పూటుగా మద్యం తాగిన యువకులు కన్నూమిన్నూ గానకుండా రోడ్లపై హల్‌చల్‌ చేశారు. పలు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు కూడా జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

నూతన సంవత్సర అమ్మకాలకు మించి..

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కూడా మూడు రోజుల ముందు నుంచే లిక్కర్‌ షాపులు మందుబాబులతో కిక్కిరిసిపోయాయి. డిసెంబర్‌ 29, 30, 31 తేదీల్లో మందుబాబులు రూ.20 కోట్లు విలువైన మద్యాన్ని తాగేశారు. అంటే రోజుకు రూ.6 కోట్లు పైబడి మద్యం అమ్మకాలు జరిగాయన్నమాట. జిల్లాలో ప్రధాన నగరమైన కాకినాడతో పాటు పెద్దాపురం, సామర్లకోట, తుని, పిఠాపురం పట్టణాల్లో మద్యపాన ప్రియులు లిక్కర్‌ షాపులకు మంచి ఊపునిచ్చారు. వీటితో పాటు తుని రూరల్‌, కాకినాడ రూరల్‌, తాళ్లరేవు, పెదపూడి, జగ్గంపేట, ప్రత్తిపాడు, గోకవరం, గండేపల్లి, ఏలేశ్వరం, శంఖవరం, ప్రత్తిపాడు రూరల్‌ తదితర మండలాల్లో సైతం బ్రాండెడ్‌ మద్యం లీటర్లకు లీటర్లు ఖాళీ చేశారు. చేతిలో సొమ్ము లేకపోయినా అప్పులు చేసి మరీ ఫుల్లుగా లాగించేశారు. మద్యం దుకాణాలు లీజుకు తీసుకున్న తరువాత ఈ స్థాయిలో అమ్మకాలు జరిగింది అదే తొలిసారని, ఇది రికార్డని లిక్కర్‌ షాపుల యాజమాన్యాలు ఖుషీ అయ్యాయి. అయితే, సంక్రాంతి వేళ నూతన సంవత్సర వేడుకల అమ్మకాలకు మించి మద్యం వ్యాపారం జరిగింది. భోగి పండగకు ముందు రెండు రోజులతో కలిపి మూడు రోజుల్లో సామర్లకోట డిస్టిలరీ నుంచి జిల్లాలోని దుకాణాలకు సుమారు రూ.21.09 కోట్ల విలువైన మద్యం సరఫరా జరిగింది. అంటే గత డిసెంబర్‌ 31 కంటే రూ.కోటి పైగా మద్యం అమ్మకాలు జరిగాయన్నమాట.

సిండికేట్‌కు లాభాల మత్తు

జిల్లాలో సంక్రాంతి కోడిపందేలు, గుండాట, ఇతర జూద క్రీడలు మద్యం అమ్మకాలు ఇబ్బడిముబ్బడిగా పెరగడానికి కలసి వచ్చాయి. ఈ బరులు నిర్వహించిన ప్రాంతాలకు సమీపాన ఇన్‌స్టెంట్‌ బెల్ట్‌షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. కాకినాడ రూరల్‌, కరప, తుని, తొండంగి, జగ్గంపేట, గండేపల్లి, సామర్లకోట, పెద్దాపురం తదితర మండలాల్లో ఈ పరిస్థితి కనిపించింది. అధికార పార్టీ నియోజకవర్గ నేతల కనుసన్నల్లోనే కోడిపందేలు నిర్వహించిన నేపథ్యంలో నిర్వాహకులు ఏమాత్రం జంకు లేకుండా మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగించి, సొమ్ము చేసుకున్నారు. మందుబాబుల నడ్డి విరిచేలా చంద్రబాబు ప్రభుత్వం బాటిల్‌పై రూ.10 పెంచి అమ్ముకునేందుకు అనుమతించింది. దీనిని ఆసరాగా చేసుకుని లిక్కర్‌ వ్యాపారులు బాటిల్‌పై అవకాశాన్ని బట్టి రూ.20, రూ.30 కూడా పెంచేసి, సొమ్ము చేసుకున్నారు. మొత్తంమీద ఈ వ్యవహారమంతా కూటమి దన్నుతో సాగుతున్న మద్యం సిండికేట్‌ను లాభాల మత్తులో ముంచింది.

మూడు రోజుల్లో మద్యం అమ్మకాలు (రూ.కోట్లు)

తేదీ బీరు కేసులు మద్యం కేసులు అమ్మకాలు

12.01.2026 4,201 9,651 7.95

13.01.2026 4,306 9,204 8.01

14.01.2026 2,001 6,908 6.03

మొత్తం 10,508 25,763 21.09

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement