సాల్మన్‌ది ప్రభుత్వ హత్యే
● దళితులపై చంద్రబాబు
ప్రభుత్వం కక్ష సాధింపు
● దళిత నేతల నిరసన
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలుస్తున్నారనే ఏకై క కారణంతో దళితులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని పలువురు దళిత నేతలు మండిపడ్డారు. గడచిన ఏడాదిన్నర కాలంలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు మితిమీరి జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా పిన్నెల్లిలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడైన సాల్మన్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు శెట్టిబత్తుల కుమార్‌రాజా ఆరోపించారు. సాల్మన్ హత్యకు నిరసనగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు కాకినాడ అంబేడ్కర్ సర్కిల్‌లో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యాన శనివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా కుమార్‌రాజా మాట్లాడుతూ, దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలకు చంద్రబాబు ప్రభుత్వం భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తామంటే మూడేళ్ల తరువాత వచ్చే తమ ప్రభుత్వంలో సరైన గుణపాఠం చెప్తామని అన్నారు. సాల్మన్ హత్యకు బాధ్యులైన నిందితులపై చట్ట ప్రకారం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హత్యలు పునరావృతమైతే జరిగే పరిణామాలకు చంద్రబాబే బాధ్యత వహించాలని ఆయనన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా వింగ్ అధ్యక్షులు కృష్ణప్రియ, ప్రధాన కార్యదర్శి జాన్ ప్రభాకర్, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నియోజకవర్గాల అధ్యక్షులు బల్ల సూరిబాబు, గుడాల వెంకటరత్నం, బంగారు కృష్ణ, లంక కృపానందం, బూల అబ్బులు, రూపా శ్రీను, జేబీఎం పార్టీ నాయకుడు ఏనుగుపల్లి కృష్ణ, రోకళ్ల సత్య, ముస్లిం మైనారిటీ విభాగం అధ్యక్షుడు ఖలీద్‌బ్బీన్ వలీ తదితరులు పాల్గొన్నారు.


