అంతా మా ఇష్టం | - | Sakshi
Sakshi News home page

అంతా మా ఇష్టం

Jan 17 2026 8:57 AM | Updated on Jan 17 2026 8:57 AM

అంతా

అంతా మా ఇష్టం

హైకోర్టు ఆదేశాలు బేఖాతరు

అధికారుల హెచ్చరికలూ డోంట్‌ కేర్‌

యథేచ్ఛగా సంక్రాంతి కోడిపందేలు

జోరుగా జూద క్రీడలు

పండగ రోజుల్లో చేతులు మారిన రూ.కోట్లు

‘అధికార’ అండతో నిర్వాహకుల బరితెగింపు

జాడ లేని పోలీసులు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): అధికారం అండ ఉంది.. ఏం చేసినా అడిగేదెవడు? అంతా మా ఇష్టం.. అన్నట్టుగా బరితెగించేశారు కోడిపందేల నిర్వాహకులు. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు.. అధికారుల హెచ్చరికలంటే డోంట్‌ కేర్‌.. అనే రీతిలో వ్యవహరించారు. ఫలితంగా సంప్రదాయం ముసుగులో సంక్రాంతి పండగ మూడు రోజులూ కోడిపందేలు.. వాటికి అనుబంధంగా గుండాటలు, ఇతర జూద క్రీడలు జిల్లావ్యాప్తంగా జోరుగా జరిగాయి. కోట్లాది రూపాయల మేర నగదు చేతులు మారింది. కోడిపందేలను నిషేధిస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చిందని, వీటిని ఎక్కడా ఏ రూపంలోనూ నిర్వహించడానికి వీల్లేదని పండగకు నాలుగు రోజుల ముందు నుంచే అధికారులు హడావుడి చేశారు. ఈ ఆదేశాలను ఎవరైనా ధిక్కరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సాక్షాత్తూ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌, ఎస్పీ, వివిధ స్థాయిల్లోని పోలీసు అధికారులు హెచ్చరించారు. దీనిపై అవగాహన కల్పించేందుకు అక్కడక్కడ ఫ్లెక్సీలు సైతం ఏర్పాటు చేశారు. కరపత్రాలు పంచారు. గ్రామాల్లో టాంటాం వేయించారు. అయినప్పటికీ పండగకు ముందు కొన్నిచోట్ల ఏర్పాటు చేస్తున్న బరులను దున్నేసి, ఫ్లెక్సీలు, టెంట్లు పీకేసి హడావుడి చేశారు. ఇంతా చేసిన వారు.. తీరా పండగ రోజుల్లో మాత్రం పత్తా లేకుండా పోయారు. భారీ ఏర్పాట్లతో పందేలు, జూద క్రీడలు బహిరంగంగానే నిర్వహిస్తున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. బరుల వద్ద వందలాది మంది గుమిగూడినా.. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరినా.. కానిస్టేబుల్‌ కాదు కదా కనీసం హోం గార్డ్‌ కూడా అటువైపు కనీసం తొంగి చూడలేదు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా అనేకచోట్ల అధికార పార్టీ నేతల అండతో కోడిపందేల బరులు విచ్చలవిడిగా వెలిశాయి. కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి దర్జాగా పందేలు నిర్వహించారు.

పోటాపోటీగా

పలు ప్రాంతాల్లో టీడీపీ, జనసేన నేతలు పోటాపోటీగా బరులు ఏర్పాటు చేశారు. కొన్ని బరుల వద్ద గుండాట నిర్వహణకు పాట పెట్టి, రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ వసూలు చేశారు. కొన్ని గ్రామాల్లో ఇరు పార్టీల నేతల మధ్య సఖ్యత కుదరకపోవడంతో వేర్వేరుగా బరులు ఏర్పాటు చేశారు. అక్కడ మద్యం విక్రయించుకునేందుకు వచ్చిన బెల్ట్‌ షాపుల యజమానుల వద్ద నాయకులు భారీగా డబ్బులు గుంజారు.

ప్రైవేటు సైన్యాల ఏర్పాటు

జిల్లావ్యాప్తంగా భోగి రోజు ఉదయం ప్రారంభమైన కోడిపందేలు, జూద క్రీడలు.. సంక్రాంతి, కనుమ పండగ రోజైన శుక్రవారం రాత్రి వరకూ యథేచ్ఛగా సాగాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కోడిపందేల బరులకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన పందెంరాయుళ్లు వేలాదిగా కార్లపై వచ్చారు. దీనినిబట్టి బరులు ఏ స్థాయిలో ఏర్పాటు చేశారో అర్థం చేసుకోవచ్చు. భారీ స్థాయిలో ఏర్పాటు చేసి బరులకు కొన్నిచోట్ల నిర్వాహకులు రెండు కిలోమీటర్ల మేర ప్రైవేట్‌ సైన్యాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఎవరూ సెల్‌ఫోన్లతో వెళ్లకుండా ఆంక్షలు పెట్టారు. కోడిపందేలు పేకాట, గుండాటలను ఏ ఒక్కరూ సెల్‌ఫోన్లలో చిత్రీకరించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పిఠాపురం మండలం కందరాడ గ్రామంలో ఓ జనసేన నాయకుడి ఆధ్వర్యాన సినీ సెట్టింగ్‌ మాదిరిగా ఏర్పాట్లు చేసి మరీ కోడిపందేలు, గుండాట నిర్వహించారు.

ఖరీదైన బహుమతులు

కొన్నిచోట్ల కోడిపందాల విజేతలకు ఖరీదైన బహుమతులు సైతం అందజేశారంటే పందేలు ఏ స్థాయిలో జరిగాయో చెప్పనవసరం లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కోడిపందేల విజేతలకు రెండు కార్లు, ఒక బైక్‌ బహుమతిగా అందించారు. కొన్నిచోట్ల నిర్వహించిన పందేల్లో ఎక్కువగా గెలిచిన వారికి కార్లు, బైకులు బహుమతిగా ఇచ్చారు. పందేల్లో పాల్గొన్న అందరికీ అక్కడే ఉచితంగా మాంసాహారంతో భోజనాలు సైతం ఏర్పాటు చేశారు. పెద్దాపురం నియోజకవర్గం పులిమేరు గ్రామంలో ఏర్పాటు చేసిన బరుల వద్ద బుల్లితెర నటులతో యాంకరింగ్‌ చేయించి, పందెంరాయుళ్లను ఉత్సాహపరిచారు. కిర్లంపూడి ప్రధాన రహదారి పక్కనే పందేలు ఏర్పాటు చేశారు. గోరింట గ్రామంలో సుమారు రూ.25 లక్షలతో భారీ ఎత్తున సెట్టింగ్‌లు వేసి మరీ కోడిపందేలు, గుండాట నిర్వహించారు. సంక్రాంతి పండగ వేళ గ్రామాల్లో ముగ్గులు, గాలిపటాల పోటీలు, కబడ్డీ వంటి సంప్రదాయ క్రీడలు నిర్వహిస్తామని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. కానీ, ఎక్కడా అటువంటి సంబరాలు కానరాకపోవడం కొసమెరుపు.

అంతా మా ఇష్టం1
1/3

అంతా మా ఇష్టం

అంతా మా ఇష్టం2
2/3

అంతా మా ఇష్టం

అంతా మా ఇష్టం3
3/3

అంతా మా ఇష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement