అవకతవకలు.. అరకోటి పైనే..
● పురోహితుని చేతివాటంపై
పూర్తయిన అధికారుల తనిఖీ
● ఈఓకు నివేదిక
● మొత్తం రూ.58.39 లక్షల మేర
స్వాహా అయినట్లు గుర్తింపు
● ఇప్పటికే రూ.28.54 లక్షల రికవరీ
● మిగిలిన సొమ్ముపై సంబంధిత
వ్యక్తులకు నోటీసులు
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో వ్రత పురోహితుల పారితోషికం బిల్లును అధిక మొత్తానికి పెంచి, ఓ పురోహితుడు చేతివాటానికి పాల్పడిన ఘటనపై పది రోజులుగా జరుగుతున్న తనిఖీ ముగిసింది. మొత్తం రూ.58.39 లక్షల మేర ఆ పురోహితుడు దారి మళ్లించినట్టు వెల్లడైంది. ఇందులో ఈపీఎఫ్‌కు చెల్లించాల్సిన మొత్తంతో పాటు, పురోహితులు వివిధ కారణాలతో తీసుకున్న అడ్వాన్సులు, ప్రొఫెషనల్ ట్యాక్స్ కింద జమ చేయాల్సినది కూడా ఉందని తేలింది. ఆ మేరకు ఈఓ వి.త్రినాథరావుకు దేవస్థానం అధికారులు శుక్రవారం నివేదిక సమర్పించారు. దారి మళ్లిన రూ.58.39 లక్షల్లో ఆ వ్రత పురోహితుడి నుంచి ఇప్పటికే రూ.28.54 లక్షలు రికవరీ చేశారు. అనంతరం, అతడు హఠాత్తుగా మృతి చెందాడు. ఆ తరువాత గత పదేళ్ల రికార్డులను అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆ పురోహితుడు 2024 జనవరి నుంచి గత ఏడాది డిసెంబర్ వరకూ ఇదేవిధంగా చేతివాటం చూపినట్లు వెల్లడైంది. ఈ మేరకు మరో రూ.29.85 లక్షలు ఇంకా రికవరీ చేయాల్సి ఉంది.
చేతివాటం ఇలా..
చేతివాటం చూపిన పురోహితుడు అన్నవరం దేవస్థానంలో వ్రత విధులు కాకుండా.. వ్రత పురోహితుల పారితోషికం (జీతాలు) బిల్లులు చేయడం, వివిధ కటింగ్‌లు పోనూ ఎవరెవరికి ఎంత వస్తుందో లెక్కించడం వంటి పనులను చాలా కాలంగా నిర్వహించేవాడు. అతడిని నమ్మిన సిబ్బంది అతడు తయారు చేసిన బిల్లులపై సరైన పరిశీలన లేకుండానే సంతకాలు చేసేవారు. వాటి ఆధారంగా సంబంధిత చెక్కులపై ఈఓ సంతకాలు చేసేవారు. దీనిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఆ పురోహితుడు బిల్లు మొత్తం పెంచి, అవకతవకలకు పాల్పడినట్లు ఆలస్యంగా గ్రహించారు. దీంతో, అతడు పదేళ్లుగా తయారు చేసిన బిల్లులపై తనిఖీలు చేయాలని ఈఓ త్రినాథరావు ఆదేశించారు. ఈ మేరకు అధికారులు పది రోజులుగా సంబంధిత బిల్లులను పరిశీలించగా.. రూ.58.39 లక్షల మేర అవతకవకలకు పాల్పడినట్టు తేలింది. ఇందులో ఎక్కువ మొత్తం తన ఖాతాకు, తన భార్య, అత్త, బావమరిది ఖాతాలకే మళ్లించాడు. ఇందులో రూ.28.54 లక్షలు గత డిసెంబర్‌లో రికవరీ చేయగా.. మిగిలిన రూ.29.85 లక్షల్లో రూ.8 లక్షలు తన ఖాతాకు, రూ.2.5 లక్షలు తన భార్య ఖాతాకు, తన ఇంటికి సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్‌కు రూ.1.40 లక్షలు జమ చేశాడు.
12 మంది ఖాతాలకు రూ.17.95 లక్షలు
మిగిలిన రూ.17.95 లక్షలను 12 మంది పురోహితుల ఖాతాలకు జమ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ 12 మందిలో తన బావమరిదికి రూ.4 లక్షలు, మరో పురోహితునికి రూ.5 లక్షలు, ఒకరికి రూ.1.90 లక్షలు, మరొకరికి రూ.90 వేలు పంపించినట్లు తేలింది. మిగిలిన ఎనిమిది మందిలో ఒక్కొక్కరికి రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకూ పంపించాడు. తన బావమరిదికి, ఇంకో పురోహితునికి ప్రతి నెలా పంపించగా, మిగిలిన వారికి ఒకటి రెండుసార్లు మాత్రమే ఆవిధంగా జమ చేసినట్లు విచారణలో తేలింది. అయితే, అతడు తమకు సొమ్ము పంపించిన మాట వాస్తవమేనని, ఆ తరువాత అతడి ఖాతాకు జమ చేయాలని చెప్తే అలాగే చేశామని ఆ పురోహితులందరూ చెబుతున్నట్లు సమాచారం. దేవస్థానానికి తిరిగి ఆ మొత్తం చెల్లించేలా ఆ పురోహితులతో వ్రత పురోహిత సంఘం నాయకులు, గతంలో అధ్యక్షులుగా పని చేసిన వారు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అలాగే, ఆ పురోహితుడు, అతడి భార్య, ఇతర కుటుంబ సభ్యుల ఖాతాల్లో పడిన మొత్తం కూడా తిరిగి చెల్లించేలా ఒప్పిస్తున్నట్లు తెలిసింది.
వారు తిరిగి చెల్లించాల్సిందే
పురోహితుడు చేతివాటం ప్రదర్శించి, 12 మంది వ్రత పురోహితుల ఖాతాలకు మళ్లించిన మొత్తాన్ని వారి నుంచి రికవరీ చేస్తాం. దీనిపై వారికి నోటీసులిస్తాం. వారు తమ ఖాతాలకు ఎక్కువ మొత్తం జమ అయినప్పుడు ఆ విషయాన్ని దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకురావాల్సింది. అలా చేయనందున ఈ తప్పులో వారు కూడా భాగస్తులైనట్లు భావించాల్సి వస్తోంది. అలాగే, ఆ పురోహితుడు, అతడి భార్య ఖాతాలకు జమ అయిన మొత్తాన్ని కూడా అతడు జీవించి లేనందున వారి కుటుంబ సభ్యులే చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత సోలార్ కాంట్రాక్టర్‌కు కూడా నోటీసు ఇస్తాం. సిబ్బందికి ఇప్పటికే షోకాజ్ నోటీసులిచ్చాం. వారు ఇచ్చే సమాధానాన్ని అనుసరించి వారిపై కూడా తదుపరి చర్యలు తీసుకుంటాం.
– వి.త్రినాథరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం
అవకతవకలు.. అరకోటి పైనే..


