సీమకు సుప్రభాతం..
● ఏకాదశ రుద్రులతో శోభిల్లిన కోనసీమ
● అంబరాన్నంటిన సంబరాలు
● జగ్గన్నతోటలో ఆధ్యాత్మిక పారవశ్యం
సాక్షి, అమలాపురం/అంబాజీపేట/కొత్తపేట: ప్రకృతి రమణీయతతో ఉట్టిపడే కోనసీమ సంక్రాంతి పండగ వేళ మరింత శోభాయమానమై అలరారుతుంది. వీధుల్లో రంగవల్లులు.. కూడళ్లలో భోగిమంటలు.. సంప్రదాయ దుస్తులలో ముస్తాబయ్యే పల్లెవాసులు.. ఒకటేమిటి.. ఆ సందడే వేరుగా ఉంటుంది. రైతుల వద్ద.. జనం వద్ద సొమ్ము లేక పండగ ఈసారి కళ తప్పినా ప్రభల తీర్థాలతో కాస్తా సందడి వచ్చింది. చారిత్రక.. ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న జగ్గన్నతోట ప్రభల తీర్థం శుక్రవారం వైభవంగా జరిగింది. ఆకుపచ్చని వరిచేల మీదుగా.. నిలువెత్తు కొబ్బరి తోటల మధ్య నుంచి.. పంట కాలువల గలగలల మధ్య అందమైన రంగురంగుల ప్రభలు.. ఈ తీర్థాలకు తరలివచ్చాయి. కొత్తపేట తీర్థంతో గురువారం ఆరంభమైన ప్రభల ఉత్సవాలు శనివారం ముక్కనుమ వరకూ సాగనున్నాయి.
కొలువుదీరిన ఏకాదశ రుద్రులు
అంబాజీపేట మండలం మొసలపల్లి శివారున చారిత్రక ప్రసిద్ధి చెందిన జగ్గన్నతోట ప్రభల తీర్థానికి భక్తులు పోటెత్తారు. ఏకాదశ రుద్రుల ప్రభలు పంట పొలాలు, కాలువలు దాటుకు వచ్చి భక్తులను పరవశింపజేశాయి. ప్రభలపై వచ్చిన ఈశ్వరుని ప్రతిరూపాలను చూసి భక్తులు తన్మయులయ్యారు. మొక్కులు తీర్చుకున్నారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాలు, ఇతర దేశాలకు ఉపాధి కోసం వెళ్లినవారు ఈ తీర్థానికి కుటుంబ సమేతంగా వచ్చారు. భక్తుల ఓంకార నాదాలు.. ప్రభలకు వేలాడదీసిన జేగంటల శబ్దాలు.. ప్రభలు మోసేవారి అశ్శరభ శరభ నినాదాలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మికతను సంతరించుకుంది.
వ్యాఘ్రేశ్వరునికి గౌరవ వందనం
జగన్నతోట ప్రభల ఊరేగింపు సంప్రదాయ పద్ధతిలో సాగింది. వ్యాఘ్రేశ్వరం నుంచి వ్యాఘ్రేశ్వర స్వామి ప్రభ వచ్చినప్పుడు మిగిలిన ప్రభలను గౌరవ సూచకంగా ఒకసారి పైకి లేపారు. గంగలకుర్రు అగ్రహారం ఉమా పార్వతీ సమేత వీరేశ్వరస్వామి, గంగలకుర్రు చెన్నకేశవ మల్లేశ్వరస్వామి ప్రభలు అప్పర్ కౌశిక దాటుకుని రావడాన్ని భక్తులు భక్తి పారవశ్యంతో వీక్షించారు. కొన్ని కుటుంబాల వారు గూడు ఎడ్లబండ్లపై తీర్థానికి రావడం పలువురిని ఆకట్టుకుంది.
అంబరాన్నంటిన కొత్తపేట ఉత్సవం
కొత్తపేట ప్రభల ఉత్సవం అంబరాన్ని తాకింది. మకర సంక్రాంతి సందర్భంగా గురువారం జరిగిన ఈ ఉత్సవానికి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచీ లక్షలాదిగా భక్తులు తరలిరావడంతో ఆ గ్రామం జనసంద్రమైంది. రోడ్లు, పురవీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. పాత రామాలయం, కొత్త రామాలయం, బోడిపాలెం వీధుల నుంచి ప్రారంభమైన ప్రధాన ప్రభల ఊరేగింపు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ జరిగింది. తిరుగు ఊరేగింపులో భాగంగా పాత, కొత్త రామాలయం వీధుల వారు అర్ధరాత్రి 2 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5.30 గంటల వరకూ పోటాపోటీగా నిర్వహించిన బాణసంచా కాల్పులతో ఆకాశం రంగురంగుల వెలుగులతో మెరిసిపోయింది.
మామిడికుదురు మండలం కొర్లగుంటలో జరిగిన తీర్థంలో 12 ప్రభలు కొలువుదీరాయి. కాట్రేనికోన మండలం చెయ్యేరు, రావులపాలెం మండలం దేవరపల్లి, పి.గన్నవరం మండలం మానేపల్లి, నాగుల్లంక, పప్పులవారిపాలెం, ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి, ఎన్.కొత్తపల్లి, వాడపర్రు, సన్నవిల్లి, అమలాపురం మండలం సాకుర్రు గరువు, బండారులంక, అమలాపురం పట్టణంలో గనికమ్మగుడి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, మలికిపురం మండలం కేశనపల్లి, తూర్పుపాలెం, రాజోలు పొదలాడ, ముమ్మిడివరం మండలం పల్లిపాలెం, క్రాప చింతలపూడి, ఐ.పోలవరం శివారు పెదమడి, ఐ.పోలవరం మండలం గుత్తెనదీవి, కపిలేశ్వరపురం మండలాల్లో ప్రభల తీర్థాలు అంగరంగ వైభవంగా సాగాయి.
55 అడుగుల ఎత్తయిన ప్రభ
అంబాజీపేట మండలం వాకలగరువు సరిహద్దులో జరిగిన ప్రభల తీర్థంలో వాకలగరువుకు చెందిన ఉమా సర్వేశ్వరస్వామి వారి ప్రభ, తొండవరం ఉమా తొండేశ్వరస్వామి వార్ల ప్రభలు 55 అడుగుల ఎత్తున నిర్మించారు. కోనసీమలో జరిగే ప్రభల తీర్థాల్లో అతి ఎత్తయిన ప్రభలుగా ఇవి గుర్తింపు పొందాయి.
జగన్నతోటలో భక్తులకు ఆపసోపాలు
జగన్నతోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండగగా గుర్తించిన ప్రభుత్వం.. నయాపైసా కూడా నిధులు విద ల్చలేదు. నిర్వాహకులే చందాలు వేసుకుని తీర్థం ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులకు సదుపాయాల కల్పనలో ప్రభుత్వ యంత్రాంగం చేతులెత్తేసింది. వేల మంది భక్తులు వస్తే పదుల సంఖ్యలోనే తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణలో పోలీస్ సిబ్బంది ముఖం చాటేశారు. మొసలపల్లి వంతెన వద్ద వీఐపీలకు కార్ పార్కింగ్ ఇవ్వడంతో అటువైపు తీర్థానికి వచ్చిన భక్తులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. ఒక దశలో ఇక్కడ తోపులాట చోటు చేసుకుంది. రాష్ట్ర పండగ పేరుతో ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారుల ప్రొటోకాల్ కల్పనకే అధికారులు పరిమితమయ్యారు.
సీమకు సుప్రభాతం..


