అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన విరవాడ దర్శకుడు
పిఠాపురం: విరవాడ గ్రామానికి చెందిన దర్శకుడు ఎంవీ సతీష్ కుమార్ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు సాధించారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో సంస్కృత భారతి ఆధ్వర్యాన ఇటీవల 7వ అంతర్జాతీయ సంస్కృత లఘు చలనచిత్రోత్సవం–2026 జరిగింది. ఇందులో ఆయన దర్శకత్వంలో సంపూర్ణంగా సంస్కృత భాషలో రూపొందించిన ‘అస్తేయం’ షార్ట్ ఫిల్మ్‌కు ద్వితీయ స్థానం లభించింది. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలతో పాటు అమెరికా నుంచి కూడా పలువురు పాల్గొన్నారు. మొత్తం 90 ఎంట్రీలు రాగా, అందులో 20 రీల్స్ విభాగానికి చెందినవి. సతీష్ కుమార్ రూపొందించిన ‘అస్తేయం’ సంస్కృత భాషను సులభంగా ప్రజలకు చేరువ చేసేదిగా గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో నటించిన కె.లలితకు ఉత్తమ నటి అవార్డు లభించడం మరో విశేషం. ఏకదంత సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి మేడూరి విష్ణువర్ధన్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. రచన సహకారం ఆచార్య సీహెచ్ సద్గుణ అందించారు. గతంలో కూడా అనేక అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో అవార్డులు అందుకున్న సతీష్ కుమార్ హైదరాబాద్‌లో తెలుగు చిత్ర పరిశ్రమలో పని చేస్తున్నారు. ఖర్జూరం, మిక్చర్ పొట్లం వంటి చిత్రాలతో పాటు మొత్తం నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే ఏకదంత – ద స్కూల్ ఆఫ్ యా న్షెంట్ స్టడీస్‌కు ఫౌండర్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.


