చొల్లంగి తీర్థం.. చూసొద్దాం
కరప: సాగర తీరంలో ఆధ్యాత్మికత పరవళ్లు తొక్కుతోంది. పురాణ ప్రసిద్ధి గాంచిన చొల్లంగి అమావాస్య తీర్థం ఆదివారం కరప మండలం ఉప్పలంక శివారు మొండి వద్ద జరగనుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ తీర్థానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇక్కడకు వేలాది మంది భక్తులు వచ్చి సముద్ర స్నానాలు చేయడం అనాదిగా వస్తోంది. దీనికోసం దేవదాయ, పోలీసు శాఖలతో పాటు, ఉప్పలంక గ్రామ పంచాయతీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఏటా మాఘమాసం ప్రారంభమయ్యే ముందు అమావాస్య రోజున తీర్థం జరుగుతుంది.
తుల్యభాగ నదీ పాయ సముద్ర తీరంలో కలిసే ప్రాంతమే సాగర సంగమం అంటారు. చంద్రుడు శాప విమోచనం పొందడానికి తన భార్య రోహిణితో కలసి ఈ సాగర సంగమం వద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడంతో శివుడు ప్రత్యక్షమై మోక్షం కలిగించినట్టు పురాణ గాథలు చెబుతున్నాయి. చొల్లంగి వద్ద సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితమే రాజరాజేశ్వరీదేవి సమేత సోమేశ్వరస్వామి ఆలయం నిర్మించినట్టు ప్రసిద్ధి. మొండి వద్ద సముద్ర తీరాన 110 ఏళ్ల కిందట మల్లాడి సత్యలింగం నాయకర్ సంగమేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించినట్టు ఈ ప్రాంత ప్రజలు అంటున్నారు. ఈ ఆలయంలో బాలాత్రిపుర సుందరీ సమేత సంగమేశ్వరస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఆలయానికి పక్కనే సీతారాముల ఆలయం, ఆంజనేయస్వామి, కాలభైరవస్వామి వార్ల ఆలయాలు ఉన్నాయి. తర్వాత పక్కనే ఉన్న చొల్లంగిలో చంద్రుడు ప్రతిష్ఠించిన రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వర స్వామివారి శివలింగాన్ని భక్తులు దర్శించుకుంటారు. సంక్రాంతి తర్వాత వచ్చే పుష్య అమావాస్య రోజున సముద్ర స్నానం చేస్తే మోక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. కాకినాడ జిల్లా నుంచే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి సముద్ర స్నానమాచరించి సంగమేశ్వరస్వామి, భైరవస్వామి, సోమేశ్వర స్వామివార్లను దర్శించుకుంటారు.
సప్త సాగర యాత్ర
చొల్లంగి అమావాస్య మరుసటి రోజు నుంచి సప్త సాగర యాత్ర ప్రారంభమవుతుంది. చొల్లంగి, కోరంగి, తీర్థాల మొండి, రామేశ్వరం, బ్రహ్మసమేథ్యం, నాసంగితిప్ప, అంతర్వేదిలలో సముద్ర స్నానం చేస్తే సప్త సాగర యాత్ర పూర్తవుతుంది. సప్త సాగర యాత్ర తర్వాత అంతర్వేదిలోని లక్ష్మీ నరసింహస్వామి తీర్థం జరుగుతుంది. చంద్రునికి శివుడు ప్రత్యక్షమైనప్పుడు నందీశ్వరునికి కూడా వరమివ్వడం వల్లనే చొల్లంగి అమావాస్య రోజున అప్పన్నెద్దులను తీసుకొచ్చి సముద్రస్నానం చేయించడం జరుగుతుందని వేదపండితులు చెబుతుంటారు. గ్రామాల్లోని వీరభద్రుడి గద్దెల నుంచి ప్రభలను తీసుకొచ్చి చొల్లంగి తీర్థం రోజున సముద్ర స్నానం చేసి, సంగమేశ్వరస్వామి, భైరవస్వామి, సోమేశ్వరస్వామివార్లను దర్శించుకుంటారు. కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యాన కరప ఎస్సై టి.సునీత పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
ట్రాఫిక్ మళ్లింపు
చొల్లంగి తీర్థం రోజున కాకినాడ ఎంఎస్‌ఎన్ చారిటీస్ నుంచి మొండి వద్ద స్నానాల రేవు వరకూ ఉండే భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారుల సూచన మేరకు ట్రాఫిక్‌ను ఒకరోజు (శనివారం అర్ధరాత్రి నుంచి) మళ్లిస్తున్నట్టు కరప ఎస్సై సునీత తెలిపారు. యానాం వైపు నుంచి తాళ్లరేవు మీదుగా వచ్చే వాహనాలు పటవల వద్ద నుంచి జి.వేమవరం, గొర్రిపూడి, పెనుగుదురు గ్రామాల మీదుగా కాకినాడకు చేరుకుంటాయన్నారు. కాకినాడ నుంచి తాళ్లరేవు, యానాం వైపు వెళ్లే వాహనాలు కాకినాడ, తూరంగి, నడకుదురు, గురజనాపల్లి గ్రామాల మీదుగా యానాం రోడ్డుకు చేరుకుని వెళ్తాయన్నారు. స్నానాల రేవు వద్ద, ఆలయం వద్ద భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవదాయ, పోలీసు శాఖల అధికారులతో కలసి అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఉప్పలంక సర్పంచ్ బొమ్మిడి నయోమి, గ్రామ కార్యదర్శి ఎం.భవాని తెలిపారు. స్నానాల రేవు వద్ద గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచినట్టు, దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు ఎంఎస్‌ఎన్ చారిటీస్ సీహెచ్ సురేష్‌నాయుడు తెలిపారు. మొండి వద్ద చొల్లంగి తీర్థం రోజున ప్రత్యేక వైద్య శిబిరం, ఆలయం వద్ద సమాచార కేంద్రం నిర్వహిస్తున్నట్టు కరప ఎంపీడీఓ జె.శ్రీనివాస్ తెలిపారు.
ఫ రేపు ఉత్సవాల నిర్వహణ
ఫ భారీగా తరలిరానున్న భక్తులు
ఫ ఏర్పాట్లు చేసిన
దేవదాయ, పోలీసు శాఖలు
చొల్లంగి తీర్థం.. చూసొద్దాం


