స్నేహబంధం.. ఎంతో మధురం
అనపర్తి: కాలం ఎంత దూరం తీసుకెళ్లినా, బాల్య స్మృతులు మాత్రం ఎప్పటికీ మధురం. దానికి ప్రతీకగా అనపర్తి శ్రీరామా జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1978–79 విద్యా సంవత్సరానికి చెందిన 10వ తరగతి విద్యార్థులు, ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఒకే వేదికపై కలుసుకున్నారు. శుక్రవారం అనపర్తిలోని టీజీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ రీయూనియన్ గడిచిన రోజులను మళ్లీ గుర్తుచేసిన ఓ అపురూప క్షణంగా నిలిచింది. తరగతి గదుల్లో మొదలైన స్నేహాలు, కాలంతో మరింత లోతుగా మారి చిరునవ్వులు, ఉద్వేగాల అంచుల్లో నిలిచిన జ్ఞాపకాలుగా మారాయి. ఈ భావోద్వేగ సమావేశంలో పూర్వ విద్యార్థులు తమ గురువుల అంకితభావాన్ని స్మరించుకుంటూ, విద్య ఇచ్చిన విలువలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ దశరథ రామారెడ్డి తేతలి, వ్యాపారవేత్తలు టి.సుధాకర్ గంగిరెడ్డి, తాడి రామచంద్రారెడ్డి, సత్తి వెంకట్‌రెడ్డి, హోతా శర్మ తదితరులు పాల్గొని తమ అనుబంధాన్ని మరింత బలపరిచారు. ఈ రీయూనియన్ ఒక కార్యక్రమం మాత్రమే కాదు జీవితాంతం మోసుకెళ్లే స్నేహానికి, జ్ఞాపకాలకు ఒక మధురమైన ఘట్టమని తమలోని భావోద్వేగాన్ని వ్యక్తపరిచారు.


