రోడ్డు ప్రమాదంలో వ్యక్తి సజీవ దహనం
వై.రామవరం: బైక్, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. వై.రామవరం ఎస్సై ఎస్.పృథ్వీ యాదవ్ కథనం ప్రకారం.. వై.రామవరం గ్రామ శివారులో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో పి.యర్రగొండ గ్రామానికి చెందిన నైని బాబూరావు (40) అక్కడికక్కడే మృతి చెందాడు. ఏలేశ్వరం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు, వై.రామవరం నుంచి పి.యర్రగొండ గ్రామానికి బైక్‌పై వెళ్తున్న బాబూరావులు ఎదురెదురుగా వెళ్తూ స్థానిక శివారులోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో బలంగా ఢీకొన్నారు. బాబూరావు బైక్‌తో పాటు బస్సు కిందకు వెళ్లిపోగా, బస్సు ఆయిల్ ట్యాంకు పగిలి బైక్‌తోపాటు అతను సజీవ దహనం అయ్యాడు. ఎస్‌ఐ పృథ్వీ యాదవ్ ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. ఆర్టీసీ బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
గోదావరిలో పడి యువకుడి మృతి
తాళ్లపూడి: కొవ్వూరు వద్ద గోదావరిలో పడి ఓ యువకుడు శుక్రవారం మృతి చెందాడు. కొవ్వూరు పట్టణ సీఐ పి.విశ్వం కథనం ప్రకారం.. పెనకనమెట్టకు చెందిన వేములూరి దినేష్ (17) కొవ్వూరులోని దొండకుంట రేవు వద్ద గోదావరిలోకి స్నానానికి దిగాడు. మధ్యాహ్నం తన మామయ్య, మరో ఐదుగురు బంధువులు, కుటుంబ సభ్యులతో కలసి గోదావరిని, గామన్ బ్రిడ్జిని చూడటానికి వచ్చారు. ఈ నేపథ్యంలో వారంతా గోదావరిలో స్నానానికి దిగారు. ఇంతలో దినేష్‌కు ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తూ గోదావరిలో మునిగి గల్లంతయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు, పోలీసులు గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టగా అతని మృతదేహం లభ్యమైంది.
లింకులు క్లిక్ చేయకండి..
పోలీస్ హెచ్చరిక
పి.గన్నవరం: నాకు రూ.5 వేలు వచ్చాయి.. మొదట్లో నకిలీ అనుకున్నాను.. మీరు ప్రయత్నించి చూడండి.. మరో పది మందికి పార్వర్డ్ చేయండి అంటూ వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్న లింకులను క్లిక్ చేయవద్దని పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు రకరకాలుగా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. వాట్సాప్, పేస్‌బుక్, ఇన్‌స్ర్ట్రాగామ్‌ల నుంచి వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దన్నారు. ఆ లింకులు ఓపెన్ చేస్తే మీ అకౌంట్లు హ్యాక్ అవుతాయన్నారు. బ్యాంకు అకౌంట్లలో నగదు కాజేస్తారన్నారు. ఇటువంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి సజీవ దహనం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి సజీవ దహనం


