కాలభైరవుని కొలుద్దామా..
కాట్రేనికోన: పల్లం పంచాయతీ బ్రహ్మసమేథ్యం వద్ద సముద్ర తీరంలో కాలభైరవస్వామి ఆలయం ప్రసిద్ధి గాంచింది.. సంతానం లేని వారికి పండంటి బిడ్డను ప్రసాదించే మూర్తిగా ఈ స్వామి పేరొందారు.. ఆదివారం చొల్లంగి అమావాస్య సందర్భంగా స్వామివారి తీర్థ మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శనివారం రాత్రి నుంచే స్వామివారి ఆలయానికి భక్తుల రాక మొదలవుతుంది. అగ్నికుల క్షత్రియుల ఆరాధ్య దైవం కాలభైరవుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. మడ అడవులు.. ఇసుక తిన్నెలు.. వివిధ పక్షులు.. రాత్రి వేళ నక్షత్రాల సాక్షిగా ఆ స్వామివారి దర్శనానికి పయనం చక్కని అనుభూతిని మిగుల్చుతుంది. ఆలయం వద్ద కమిటీ ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తాయి. భక్తులు శనివారం రాత్రికి ఆలయానికి చేరుకుని ఆదివారం వేకువ జామునే సముద్ర స్నానం చేస్తూ సముద్ర గర్భం నుంచి ఉదయిస్తున్న సూర్యభగవానుడిని దర్శించుకోవచ్చు.
బ్రహ్మసమేథ్యం వద్ద సముద్ర తీరంలో సంతాన మూర్తిగా వెలసిన కాలభైరవుడు స్వయం భువుడు. సుమారు 250 ఏళ్లకు పూర్వం సముద్రంలో చేపల వేటకు వెళ్లిన పూర్వికులకు కాలభైరవుడు, పార్వతీ సమేత బ్రహ్మేశ్వరుడు (బ్రహ్మ సూత్రం) ప్రతిమలు వలలో చిక్కుకున్నాయి. స్వయం భువులుగా వెలసిన విగ్రహాలను ప్రతిష్ఠించి ఆలయాలు నిర్మించి ఏటా చొల్లంగి అమావాస్య రోజున చొల్లంగి తీర్థ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే గత రెండేళ్ల క్రితం నూతన ఆలయాన్ని నిర్మించారు. ఆదివారం చొల్లంగి తీర్థం రావడంతో భక్తులు ముందు రోజు శనివారం సాయంత్రానికి ఆలయానికి చేరుకుంటారు. పల్లం, నీళ్లరేవు, చిర్రయానం, కొత్తపాలెం, మొల్లేటిమొగ తదితర గ్రామాల ప్రజలు వస్తుంటారు. స్వామికి ఇష్టమైన క్షీరాన్నం నైవేద్యంగా పెడతారు.
స్వామి పాదముద్రలు ప్రత్యేకం
తుపాను ప్రభావంతో తాడి చెట్టు ఎత్తున సముద్రం ఎగసి వస్తున్నప్పుడు స్వామి సముద్రానికి ఎదురుగా శిలపై కూర్చుని దంత ధావనం చేసుకున్నాడని, సముద్రం వెనుదిరిగి వెళ్లిపోయిందని పురాణ ప్రసిద్ధి. దీనికి గుర్తుగా ఆలయం ఎదుట స్వామివారి పాద ముద్రలు ఉన్న శిల భూమిలో దిగి ఉంటుంది.
సంతాన ప్రదాతగా..
పిల్లలు లేని దంపతులకు పండంటి బిడ్డను ప్రసాదించే సంతాన మూర్తిగా కాలభైరవుడు ప్రసిద్ధి చెందారు. సంతానం లేని మహిళలు చొల్లంగి అమావాస్య రోజున రాత్రి వేళ సముద్ర స్నానం ఆచరించి తడి వస్త్రాలతో స్వామివారి పాదముద్రలపై పడతారు. తర్వాత మహిళలు నిద్రలోకి జారుకుంటారు. మహిళలకు నిద్రలో స్వామి నిదర్శనం ఇస్తారని ఆలయ అర్చకులు చెబుతుంటారు. సంతానం కలిగిన మహిళలు బిడ్డలతో పాటు స్వామిని దర్శించుకుని అరటి గెలను, కొబ్బరి మొక్కను మొక్కులుగా చెల్లిస్తారు.
నూతన ఆలయం.. శోభాయమానం
అత్యంత పురాతన కాలభైరవస్వామి ఆలయం జీర్ణ దశకు చేరుకోవడంతో పల్లం గ్రామ ప్రజలు ఆర్థిక సాయంతో అత్యంత అద్భుతంగా నూతన ఆలయాన్ని నిర్మించారు. కేశనకుర్రు గ్రామానికి చెందిన దివంగత గాదిరాజు వెంకట కృష్ణంరాజు జ్ఞాపకార్థం సత్యధనశ్రీ హేచరీస్ అధినేత గాదిరాజు చినసుబ్బరాజు, వెంకటలక్ష్మి దంపతుల ఆర్థిక సహాయంతో కాలభైరవ స్వామి, బ్రహ్మేశ్వరస్వామి, కనకదుర్గమ్మ, గంగమ్మ ఆలయాలకు పూర్తిగా గ్రానైట్ వేయించారు. మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్ పర్యవేక్షణలో ఆలయం నిర్మాణం చేపట్టి ప్రహరీ, సముద్రం వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు.
ఇలా చేరుకోవచ్చు..
ఆలయానికి అమలాపురం నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంటుంది. అమలాపురం –పల్లం, అమలాపురం–కాట్రేనికోన, చిర్రయానం మీదుగా నీళ్లరేవుకు బస్సు సౌకర్యం ఉంటుంది. సొంత వాహనాలపై తీర్థానికి వచ్చే భక్తులు అమలాపురం నుంచి అనాతవరం–ఉప్పలగుప్తం–ఎన్ కొత్తపల్లి, గచ్చకాయలపోర–చిర్రయానం మీదుగా చొల్లంగి తీర్థానికి చేరుకోవచ్చు.
బ్రహ్మసమేథ్యంలో రేపు తీర్థం
కాలభైరవుని కొలుద్దామా..
కాలభైరవుని కొలుద్దామా..


