వైఎస్సార్ లీగల్ సెల్‌లో ఇద్దరికి చోటు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కమిటీలో జిల్లా నుంచి ఇద్దరికీ చోటు కల్పించారు. కాకినాడ సిటీ నియోజకవర్గానికి చెందిన కొల్ల ఆదిత్యకుమార్‌ను రాష్ట్ర వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జోన్ 2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గాను, ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన చెలంకూరి రామకృష్ణను లీగల్‌సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించారు.
స్కేటింగ్ పోటీలలో
జిల్లాకు పతకాలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): గ్వాలియర్‌లో జరిగిన జాతీయస్థాయి పాఠశాల క్రీడాసమాఖ్య స్కేటింగ్ పోటీలలో జిల్లా క్రీడాకారులు ప్రతిభను కనపరచి పతకాలు సాధించారని ఎస్‌జీఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సుధారాణి బుధవారం తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి పరిధిలో 6 బంగారు, 2 వెండి, 5 రజత పతకాలు జిల్లా క్రీడాకారులు కై వసం చేసుకున్నారన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులు డీఈఓ పి.రమేష్‌ను ఆయన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను డీఈఓ అభినందించారు. పిఈటీ సంఘ మాజీ అధ్యక్షుడు ఎల్.జార్జి, టీం మేనేజర్ దుర్గా, కోచ్ హరికృష్ణ, ఏసుబాబు పాల్గొన్నారు.
సత్యదేవునికి
జన్మ నక్షత్ర పూజలు
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి జన్మ నక్షత్రం ‘మఖ’ సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకం, ఆయుష్యహోమం నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటలకు స్వామివారి ఆలయాన్ని తెరిచి పూజలు చేశారు. అనంతరం సత్యదేవుడు, దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి, శంకరుల మూలవిరాట్ లకు పండితులు పంచామృతాలతో మహాన్యాశ పూర్వక అభిషేకం నిర్వహించారు. అలంకరించి పూజలు చేశారు. తరువాత ఉదయం ఆరు గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. యాగశాలలో ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు స్వామివారికి ఆయుష్య హోమం నిర్వహించారు. అనంతరం ఘనంగా పూర్ణాహుతి నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠీ, చిట్టి శివ, యనమండ్ర శర్మ ఘనపాఠీ, గంగాధరబట్ల గంగబాబు, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
ప్రతిపాదనకు ఆమోదం
బాలాజీ చెరువు: కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో స్కిల్ హబ్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. కాలేజీ ప్రాంగణంలో గ్రౌండ్ ప్లస్ టూ (ఎ+2) అంతస్తులతో కూడిన శాశ్వత భవనంలో హాస్టల్, మెస్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఎంపీ సానా సతీష్‌బాబు మొదట విడతగా రూ.5.30 కోట్లకు ప్రతిపాదనను పంపగా, కలెక్టర్ ఆమోదం తెలిపారు.


