పగలు రెక్కీ... రాత్రి నక్కి...
● ఒక్కడే... 13 దొంగతనాలు
● పోలీసులకు చిక్కిన దొంగ
కాకినాడ క్రైం: ఒక్కడే దొంగ, 13 దొంగతనాలు అవలీలగా చేసేశాడు. అన్ని చోట్ల కేసులు నమోదవడమే కానీ, ఎక్కడా పట్టుబడలేదు. తాజా చోరీలో మాత్రం కాకినాడ రూరల్ ఇన్‌స్పెక్టర్ డీఎస్ చైతన్యకృష్ణ బృందానికి చిక్కి కటకటాల పాలయ్యాడు. సంబంధిత వివరాలను కాకినాడ ఏఎస్పీ, ఎస్‌డీపీవో దేవరాజ్ మనీష్ పాటిల్ బుధవారం కాకినాడలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. కరపలోని నీలయ్యతోట ప్రాంతంలో ఓ భారీ చోరీ జరిగింది. ఇన్‌స్పెక్టర్ చైతన్యకృష్ణ బృందం కేవలం ఒక్క రోజులోనే కేసు ఛేదించి నిందితుడ్ని పట్టుకొని నగలు, నగదు రికవరీ చేసింది. కాకినాడ పర్లోవపేటకు చెందిన 22 ఏళ్ల సుంకర తేజ ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. చిన్న వయసులోనే దొంగతనాల్లో ఆరితేరిన తేజ పగలు రెక్కీ నిర్వహించి, రాత్రి వేళల్లో నక్కి ఇళ్లు కొల్లగొట్టేవాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లే ఇతడి లక్ష్యం. ముందు అక్కడే ఉన్న కిటికీలు, షూలో తాళం చెవులు వెతుకుతాడు. దొరకకపోతే దొడ్డి దారిలో వెళ్లి తలుపులు బద్దలు కొట్టి తెరుస్తాడు. లోపలికి చొరబడి ఇళ్లు గుల్ల చేస్తాడు. ఇదే తీరులో 13 దొంగతనాలు చేశాడు. కాకినాడ అర్బన్, గ్రామీణ మండలాల్లోని దాదాపు అన్ని స్టేషన్లలోనూ అతడిపై కేసులు ఉన్నాయి. నిందితుడిని సాంకేతికత సాయంతో ఒక్క రోజులోనే పర్లోవపేటలో పట్టుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. సీఐ చైతన్యకృష్ణ బృందానికి ఎస్‌ఐ టి.సునీత, క్రైం బృందం సహకరించాయని ఏఎస్పీ అన్నారు.


