తమిళ బెల్లం.. రుచి అమోఘం
పిఠాపురం: తమిళనాడు అనగానే మనకు నోరూరించే సాంబారు గుర్తుకువస్తుంది. ఒక్కసారి తింటే మరిచిపోలేని అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు దానికి పోటీగా తాటిబెల్లం వచ్చింది. ప్రస్తుతం తాటిబెల్లం సీజన్ కావడంతో ఎక్కడ చూసినా వీటి అమ్మకాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా తమిళనాడుకు చెందిన వ్యాపారులు పిఠాపురం, గొల్లప్రోలు, కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో తాటి బెల్లాన్ని విక్రయిస్తున్నారు. మామూలు బెల్లం కేజీ రూ.50 వరకూ, తమిళ తాటిబెల్లాన్ని కేజీ రూ.140, మిరియాలు, అల్లం వంటివి కలిపి తయారు చేసిన దాన్ని కేజీ రూ.250 వరకు విక్రయిస్తున్నారు. కన్యాకుమారి ఏరియాలో ఈ బెల్లం తయారు చేస్తారని, అక్కడి నుంచి లారీలపై తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్టు ఆ ప్రాంతానికి చెందిన పరమేశన్ తెలిపాడు.


