85.61 మీటర్లకు చేరిన ఏలేరు
ఏలేశ్వరం: ఇటీవల కురిసిన వర్షాలతో ఏలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు మరింత పెరిగాయి. పరీవాహక ప్రాంతం నుంచి 2,479 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా సోమవారం 85.61 మీటర్లకు చేరింది. పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, నీటి నిల్వలు 22.18 టీఎంసీలకు చేరాయి. ఆయకట్టుకు 3 వేలు, విశాఖకు 175 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. పంపా, తిమ్మరాజు చెరువుకు నీటి విడుదల నిలిపివేశారు.
పీజీఆర్‌ఎస్‌కు 571 అర్జీలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 571 అర్జీలు సమర్పించారు. వారి నుంచి వివిధ శాఖల అధికారులు, అర్జీలు స్వీకరించారు. బియ్యం కార్డుల మంజూరు, ఇళ్ల స్థలాలు, ఆన్‌లైన్‌లో భూమి వివరాల నమోదు, పూడికల తొలగింపు, పారిశుధ్యం తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలు అర్జీలు సమర్పించారు.
వివాహానికి పార్కింగ్ స్థలం
● అద్దెకిచ్చిన అన్నవరం దేవస్థానం
సీఆర్‌ఓ అధికారులు
● పెళ్లి సెట్టింగ్‌ను అడ్డుకున్న
ఇంజినీరింగ్ అధికారులు
● చైర్మన్ ఆగ్రహం
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయం (సీఆర్‌ఓ) విభాగం అధికారుల నిర్వాకానికిదో మచ్చుతునక. వివరాలివీ.. కార్తిక మాసంలో సత్యదేవుని ఆలయానికి వేలాదిగా భక్తులు వస్తున్న విషయం తెలిసిందే. వారి వాహనాల పార్కింగ్‌కు సత్యగిరిపై హరిహర సదన్ సత్రం ఎదురుగా ఉన్న స్థలాన్ని కేటాయించారు. అయితే, ఇదే స్థలాన్ని సీఆర్‌ఓ అధికారులు ఈ నెల 8న జరిగే వివాహానికి అద్దెకివ్వడం వివాదాస్పదమైంది. ఆ పెళ్లి బృందం వారు ఆ స్థలంలో ఐదు రోజుల ముందు నుంచే వివాహ సెట్టింగ్ వేయడం మొదలు పెట్టారు. ఇది గమనించిన దేవస్థానం ఇంజినీరింగ్ ఈఈ రామకృష్ణ అభ్యంతరం తెలిపారు. ఆ స్థలాన్ని తాము ముందుగానే రిజర్వ్ చేసుకున్నామని ఆ పెళ్లి బృందం వారు చెప్పడంతో విషయాన్ని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో సీఆర్‌ఓ అధికారులపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం వేలాదిగా భక్తులు తరలి వస్తారని, వారి వాహనాలను అక్కడే నిలపాల్సి వస్తుందని, అలాగే, ఎనిమిదో తేదీ శనివారం కూడా రద్దీ ఉంటుందని, ఇవేమీ చూసుకోకుండా ఆ స్థలాన్ని పెళ్లికి రిజర్వ్ చేశారని ప్రశ్నించారు. భక్తుల వాహనాలు నిలిపే స్థలాలను కార్తిక మాసం పూర్తయ్యేంత వరకూ వివాహాలకు ఇవ్వవద్దని ఆదేశించారు.
జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా
సత్యనారాయణ
సాక్షి, రాజమహేంద్రవరం: స్థానిక ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్‌గా డాక్టర్ పచ్చిమాల వీర వెంకట సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు వైద్య విద్య సంచాలకుడు రఘునందన్ గంభీర సోమవారం ఉత్తర్వులు వెలువరించారు. ఇప్పటి వరకూ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా కొనసాగిన డాక్టర్ సౌభాగ్యలక్ష్మి గత నెలాఖరున ఉద్యోగ విరమణ చేశారు. ఆ స్థానంలో సత్యనారాయణ నియమితులయ్యారు. ఆయన అదే ఆస్పత్రిలో రెండేళ్లుగా జనరల్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్, హెచ్‌ఓడీ హోదాలో కొనసాగుతున్నారు. సత్యనారాయణ 1983 బ్యాచ్ కాకినాడ రంగరాయ వైద్య కళాశాల (ఆర్‌ఎంసీ) విద్యార్థి. అదే కళాశాలలో 1996లో మెడిసిన్‌లో పీజీ పూర్తి చేశారు. తొలి పోస్టింగ్ 1999లో ఆర్‌ఎంసీలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా లభించింది. 2006లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగోన్నతి పొంది, 2012 వరకూ కొనసాగారు. అప్పటి నుంచి 2015 వరకూ కార్డియాలజీ విభాగంలో అసోసియేట్, ప్రొఫెసర్ హోదాల్లో పని చేశారు. 2016 నుంచి 2017 మధ్య ఏడాది పాటు కాకినాడ జీజీహెచ్‌లో సీఎస్ ఆర్‌ఎంఓగా పని చేశారు. 2023 వరకూ పేరెంట్ డిపార్ట్‌మెంట్ జనరల్ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్ హోదాలో కొనసాగారు. రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో కొన్ని రోజుల పాటు ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా పని చేశారు. 26 ఏళ్ల వృత్తి జీవితంలో 10 మంది కలెక్టర్ల నుంచి ఉత్తమ వైద్యుడిగా అవార్డులు అందుకున్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా నియమితులైన పీవీవీను కాకినాడ ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్ధన్, ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు వైద్యాధికారులు, సిబ్బంది, వివిధ సంఘాల నేతలు అభినందించారు.
85.61 మీటర్లకు చేరిన ఏలేరు


