వ్యసనాలకు బానిసలై గంజాయి విక్రయాలు
● నలుగురిని పట్టుకున్న పోలీసులు
● వారిలో ఇద్దరు మైనర్లు
● రూ.1.20 లక్షల విలువైన
24 కేజీల గంజాయి స్వాధీనం
కాకినాడ రూరల్: వ్యసనాలకు బానిసలైన నలుగురు గంజాయిని విక్రయిస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో వారిని శనివారం పోలీసులు పట్టుకున్నారు. నిందితుల్లో ఇద్దరు పాత నేరస్తులు, మిగిలిన ఇద్దరూ మైనర్లు. సర్పవరం సీఐ పెద్దిరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయిపై వచ్చిన విశ్వనీయ సమాచారం మేరకు ఎస్సై పి.శ్రీనివాస్‌కుమార్ సిబ్బందితో శనివారం ఉదయం దాడి చేశారు. రమణయ్యపేట ఏపీఐఐసీ పారిశ్రామిక వాడ సమీపంలోని ఖాళీ భవనంలో నలుగురిని గంజాయితో పట్టుకున్నారు. వారి వద్ద ఆరు కిలోల చొప్పున గంజాయి ఉన్నట్టు గుర్తించారు. డిప్యూటీ తహసీల్దార్ కల్యాణ్ చక్రవర్తి, మధ్యవర్తుల సమక్షంలో నిందితుల నుంచి రూ.1.20 లక్షల విలువైన 24 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో రమణయ్యపేటకు చెందిన బులిపె అజయ్ కుమార్, ఇంద్రపాలెం గ్రామానికి చెందిన అనపర్తి శివశంకర్ పాత నేరస్తులు, మిగిలిన ఇద్దరూ 17 ఏళ్ల మైనర్లు. ప్రధాన నిందితులను జ్యూడీషియల్ రిమాండ్‌కు, మైనర్లను రాజమహేంద్రవరం జువైనైల్ జస్టిస్ బోర్డుకు తరలించారు. వీరందరూ స్నేహితులని, వ్యసనాలకు అలవాటు పడడంతో డబ్బు కోసం నర్సీపట్నం ఏజెన్సీ నుంచి కిలో రూ.2 వేలకు గంజాయి కొనుగోలు చేసి కాకినాడలో విక్రయాలకు పాల్పడుతున్నారని సీఐ పెద్దిరాజు తెలిపారు.


