ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కాకినాడ రూరల్: మోంథా తుపాను ప్రభావం తీవ్రంగా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. సూర్యారావుపేట బీచ్ వద్ద అల్లకల్లోలంగా ఉన్న సముద్రాన్ని పరిశీలించారు. నేమాం, పోలవరం, సూర్యారావుపేట, వాకలపూడి ఫిషింగ్ హార్బర్లను సందర్శించి, తుపాను ప్రభావం ఎక్కువగా ఉందని గుర్తించారు. సముద్రం పోటు ఉండటంతో గ్రామాల నుంచి వచ్చే నీరు ఎగదన్ని ముంపు సమస్య తలెత్తుతుందన్నారు. హార్బర్‌పేటలో మత్స్యకారులను కలసి తుపాను తీవ్రంగా ఉన్నందున పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ఇళ్ల కంటే ప్రాణాలు ముఖ్యమని అన్నారు. ఈ సందర్భంగా కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తీర గ్రామాలను సందర్శించామన్నారు. తుపాను బాధిత ప్రజలకు సేవలందించేందుకు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం సిద్ధంగా ఉంటామన్నారు. గాలుల తీవ్రతకు కరెంట్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉన్నందున అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి, తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. పునరావాస కేంద్రాల్లో మెరుగైన సదుపాయాలతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సేవలందించాలని కోరారు.
గత ప్రభుత్వం మాదిరిగా ఆదుకోండి
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తుపానులు వచ్చినప్పుడు వలంటీర్లు, సచివాలయ సిబ్బందితో మందులు, నిత్యావసర సరకులు, నేరుగా ఇళ్లకే పంపించామని కన్నబాబు గుర్తు చేశారు. ఆర్‌ఓ ప్లాంట్ క్యాన్లు, వాటర్ ప్యాకెట్లు అందించామన్నారు. పునరావాస కేంద్రాల నుంచి తిరిగి వెళ్లేటప్పుడు బాధితులకు రూ.2 వేల సహాయం అందించామని చెప్పారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్నందున ఎక్కడా అలసత్వం లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని కోరారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాదిరిగా ప్రజలను ఆదుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని కన్నబాబు కోరారు. ముఖ్యంగా జీవనోపాధి కోల్పోతున్న మత్స్యకారులను, వరి పంట దెబ్బ తిని నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని కన్నబాబు విజ్ఞప్తి చేశారు. తాము మాట్లాడేది రాజకీయమని అనుకోకుండా, ప్రజలకు సాయం చేసేందుకు ప్రభుత్వం అండగా ఉండాలని అన్నారు. పంటల బీమా లేకపోవడంతో వరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ–క్రాప్ కూడా చేయలేదని, దీనిపై ప్రభుత్వం విధానపరమైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. అప్పటి సీఎం జగన్ రైతులను కంటికి రెప్పలా ఆదుకునేందుకు ఉచిత పంటల బీమా అమలు చేశారని, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సేవలందించామని గుర్తు చేశారు. తుపానుతో నష్టపోయే రైతులను గాలికి వదిలేయరాదని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలచిపోయాయని, తుపాను వలన అంటువ్యాధులు, ఇతర సమస్యలు వస్తే ప్రజలు ఎక్కడకు వెళ్లాలని కన్నబాబు ప్రశ్నించారు. కార్యక్రమంలో నేమాం సర్పంచ్ రామదేవు చిన్నా, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఫ తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది
ఫ వైఎస్సార్ సీపీ తరఫున
అండగా ఉంటాం
ఫ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి
ఫ మాజీ మంత్రి కురసాల కన్నబాబు


