లోవ దేవస్థానంలో భక్తజన సందోహం
తుని రూరల్: కోరిన కోర్కెలు తీర్చే తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తజనంతో లోవ దేవస్థానం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలిచ్చిన 40వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,82,535, పూజా టికెట్లకు రూ.1,30,740, కేశఖండనశాలకు రూ.14,860, వాహన పూజలకు రూ.4,670, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.73,932, విరాళాలు రూ.1,02,063 వెరసి మొత్తం రూ.5,08,800 ఆదాయం సమకూరినట్టు ఈఓ వివరించారు.
అలరించిన కవి సమ్మేళనం
జాతీయ స్థాయిలో 126 మంది కవుల రాక
అమలాపురం టౌన్: అంర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక సంస్థ శ్రీశ్రీ కళా వేదిక 147వ జాతీయ స్థాయి ఉగాది శతాధిక కవి సమ్మేళనం స్థానిక శ్రీకళా రెసిడెన్సీలో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ వీనుల విందుగా సాగింది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి 126 మంది కవులు హాజరై ఉగాది కవితా గానాలతో అలరించారు. వేదిక సీఈవో డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అధ్యక్షతన జరిగిన సమ్మేళనంలో తెలుగు కవిత్వానికి వెలుగులు నింపిన మహా కవులు డాక్టర్ బోయి భీమన్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటాలకు సాహితీ దిగ్గజాలు పూల మాలలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వేదిక అంతర్జాతీయ సమన్వయకర్త కొల్లి రమావతి మాట్లాడుతూ కవిత్వం అంటే అక్షర తాండవమని, కాలంతో పాటు కవిత్వం మారాలని ఆమె సూచించారు. సమ్మేళనానికి విచ్చేసిన ప్రతీ కవిని వేదిక తరఫున ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసి అభినందించారు. వచ్చే నెల 10, 11 తేదీల్లో ఏలూరులో జరగనున్న ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ప్రతాప్ వెల్లడించారు. వేదిక జిల్లా ఽఅధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి, కోనసీమ రచయిత సంఘం అధ్యక్షుడు బీవీవీ సత్యనారాయణ, వేదిక జాతీయ కార్యదర్శి మాకే బాలార్జున సత్యనారాయణలు పర్యవేక్షించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నంచి ఉగాది కళారత్న హంస పురస్కారాన్ని అందుకున్న డాక్టర్ ప్రతాప్‌ను కవులు అభినందించారు. సమ్మేళన సభలో వేదిక కమిటీ సభ్యులు యెండూరి సీతామహాలక్ష్మి, పోలిశెట్టి అనంతలక్ష్మి అరిగెల బలరామమూర్తి, శ్రీపాద రామకృష్ణ, కడలి సత్యనారాయణ, గోదావరి పత్రిక సంపాదకుడు బోళ్ల సతీష్‌లు ప్రసంగించారు.
లోవ దేవస్థానంలో భక్తజన సందోహం


