పీపీపీ విధానాన్ని అడ్డుకుంటాం
తుని రూరల్: ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, అనుబంధ 500 పడకల ఆస్పత్రులను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించే విధానాన్ని అడ్డుకుంటామని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. బుధవారం ఎస్.అన్నవరంలోని పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన భోగిమంటలో ఆ జీఓ ప్రతులను నాయకులు, కార్యకర్తలతో కలసి ఆయన దగ్ధం చేశారు. కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబునాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని సూర్యభగవానుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో జిల్లాకు ఒకటి చొప్పున వైద్య కళాశాల, బోధనాస్పత్రుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారన్నారు. ఇందులో ఏడు వైద్య కళాశాలలు పూర్తికాగా మిగిలిన పది కళాశాలలు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయన్నారు. జగన్ చిత్తశుద్ధితో ఏర్పాటు చేసిన ఈ కళాశాలలు, ఆస్పత్రులను చంద్రబాబు ప్రభుత్వం తన అనుచరులకు ఎకరా రూ.వంద చొప్పు 66 ఏళ్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలన్న వైఎస్సార్ సీపీ లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. వైద్య కళాశాలలు, బోధనాసుపత్రులు రాష్ట్ర ప్రజల సంపద అని, వాటిని ఎవరూ విక్రయించలేరన్నారు. ప్రజల ఆస్తులకు చంద్రబాబు కస్టోడియన్ మాత్రమే అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 99 పైసలకే ఇచ్చేస్తాననడం సరికాదన్నారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ కంపెనీలు, ఊరు పేరు లేని కంపెనీలకు రూ.వేలాది కోట్ల విలువైన ఆస్తులు ధారాదత్తం చేయడం మంచిదికాదన్నారు. గత ఐదు సంవత్సరాల్లో జగన్‌మోహన్‌రెడ్డి రూ.3.33 లక్షల కోట్లు అప్పు చేస్తే 19 నెలల్లో కూటమి ప్రభుత్వం రూ.3.02 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. సంపద సృస్టిస్తామని అధికారంలోకి వచ్చి కేంద్రం సహకారంతో విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం పునరాలోచించి గ్రాంట్లు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నారు. మీ బలంతో కేంద్ర ప్రభుత్వం నిలబడిందని, అందువల్ల గ్రాంట్లు తీసుకురావాలన్నారు. రాజ్యాంగం రచించిన డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని తక్కువ డబ్బుతో జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి చేసి రాష్ట్ర ఆస్తిగా అప్పగించారన్నారు. ఆ విగ్రహానికి 19 నెలలుగా సరైన నిర్వహణ చేయడం చేతకాలేదన్నారు. ఎన్‌టీ రామారావు అంటే మాకు గౌరవమే. దురదృష్టవాశాత్తు రెండు సార్లు వెన్నుపోటుకు గురయ్యారు. ఒక పార్టీకి సంబంధించిన మనిషి, ఆ పార్టీ నిధులతో 600 కాదు 1600 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని, రూ.1750 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి విగ్రహం ఏర్పాటు చేయడంపై సరికాదన్నారు. మీ పార్టీ దగ్గర రూ.వేలాది కోట్లు ఉన్నాయి. ఆ డబ్బు ఖర్చు చేసి మీ నాయకుడిని గౌరవించుకోవాలన్నారు.ఈ డబ్బుతో నాలుగైదు వైద్య కళాశాలలు పూర్తవుతాయన్నారు. వైఎస్సార్ సీపీ, అనుబంధ విభాగాల నాయకులు నాగం దొరబాబు, రేలంగి రమణ గౌడ్, రాయి మేరీ అవినాష్, అన్నంరెడ్డి వీర్రాఘవులు, అంగుళూరి సుశీల, చింతల సునీత, పట్టణ, తుని, తొండంగి మండలాల పార్టీ అధ్యక్షులు అన్నవరం శ్రీను, దుంగల నాగేశ్వరరావు, బత్తుల వీరబాబు, పోతల రమణ, చింతల వెంకటరమణ పాల్గొన్నారు.
ప్రజల ఆస్తులకు
సీఎం కస్టోడియన్ మాత్రమే
మాజీ మంత్రి దాడిశెట్టి రాజా
భోగి మంటలో జీఓ ప్రతుల దగ్ధం
వైద్య కళాశాలల
ప్రైవేటీకరణకు నిరసన


