జగన్ పాలనే మెరుగు
● చంద్రబాబు ప్రభుత్వంపై
అసంతృప్తి వ్యక్తం చేస్తున్న యువత
● మళ్లీ జగన్ వస్తేనే ప్రజల వద్దకు
పాలన వస్తుందని ఆశాభావం
గోకవరం: ఎన్నో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కంటే గత వైఎస్సార్ సీపీ పాలనే ఎంతో మెరుగ్గా ఉందని పలువురు ఎన్‌ఆర్‌ఐలు, ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్న వారు అభిప్రాయపడుతున్నారు. తంటికొండ గ్రామానికి చెందిన బద్దిరెడ్డి ధర్మరాజు ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అలాగే, బద్దిరెడ్డి కార్తీక్ హైదరాబాద్, దాసరి దొరబాబు, బద్దిరెడ్డి రాజారాం వివిధ రాష్ట్రాల్లో పని చేస్తున్నారు. వీరందరూ సంక్రాంతి పండగకు స్వగ్రామానికి వచ్చారు. వీరు గ్రామంలో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ రాష్ట్రంలో పరిపాలనపై చర్చించుకున్నారు. ‘సాక్షి’ పలకరించగా రాష్ట్రంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ పని తీరుపై గుర్తించిన పలు విషయాలను వారు పంచుకున్నారు. బద్దిరెడ్డి కార్తిక్ మాట్లాడుతూ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ప్రజల వద్దకు పాలన అందించే దిశగా గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాలు నిర్మించారన్నారు. గతంలో రేషన్ తీసుకోవడానికి పనులు మానుకుని గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వచ్చేదని, ఆ కష్టాలు తీరేలా ఇంటి వద్దకే రేషన్ సరఫరా చేశారని గుర్తు చేసుకున్నారు. బద్దిరెడ్డి ధర్మరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, వైద్యానికి జగన్ విశేషంగా కృషి చేశారని కొనియాడారు. నాడు – నేడు పథకంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీర్చిదిద్దిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వాస్పత్రి భవనాలను ఆధునీకరించి నాణ్యమైన వైద్య సేవలందించారన్నారు. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలల ఉండాలనే లక్ష్యంతో నూతన వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టారని అన్నారు. కానీ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఈ పథకాల అమలులో వెనుకబడిందని అభిప్రాయపడ్డారు. వలంటీర్లలను తొలగించి సచివాలయ వ్యవస్థను నీరుగార్చారన్నారు. ఇంటింటికీ రేషన్ రద్దు చేయడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో చేపట్టిన వైద్య కళాశాలలను పూర్తి చేయకుండా ప్రైవేటీకరించేందుకు చూస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పేరుతో ప్రయాణికులందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.


