ప్రభల తీర్థం.. కన్నుల వైభవం
● కోనసీమ ప్రభలకు ఎంతో గుర్తింపు
● ఇతర రాష్ట్రాల నుంచీ భక్తుల రాక
సాక్షి, అమలాపురం/అంబాజీపేట/ కొత్తపేట: జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ జరిగే ఉత్సవాలను తిలకించడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలివచ్చారు. ముఖ్యంగా కోనసీమలో జరిగే ప్రభల ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజున జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వరకు ప్రభల తీర్థాలు జరుగుతాయి. వాటిలో కొత్తపేట, జగ్గన్నతోటలో జరిగే ప్రభల ఉత్సవాలు ముఖ్యమైనవి. వీటితో పాటు చిరుతపూడి (అవిడి డ్యామ్ సెంటర్), మామిడికుదురు మండలం కొర్లగుంట, కాట్రేనికోన మండలం చెయ్యేరులలో అతి పెద్ద ప్రభల తీర్థాలు నిర్వహిస్తారు.
జగ్గన్నతోటలో..
అంబాజీపేట మండలం మొసలపల్లి – ఇరుసుమండ గ్రామాల మధ్య గల ఏకాదశ రుద్రుల ప్రభల తీర్థాలు జరుగుతాయి. వ్యాఘ్రేశ్వరం – వ్యాఘ్రేశ్వరుడు, కె.పెదపూడి – మేనకేశ్వరుడు, ఇరుసుమండ – ఆనంద రామేశ్వరుడు, వక్కలంక – విశ్వేశ్వరుడు, నేదునూరు – చెన్నమల్లేశ్వరస్వామి. ముక్కామల – రాఘవేశ్వరుడు, మొసలపల్లి – భోగేశ్వరుడు, పాలగుమ్మి – చెన్న మల్లేశ్వరుడు, గంగలకుర్రు అగ్రహారం – వీరేశ్వరుడు, గంగలకుర్రు – చెన్నమల్లేశ్వరుడు, పుల్లేటికుర్రు – అభినవ వ్యాఘ్రేశ్వరుడు ప్రభలు ప్రసిద్ధి చెందాయి.
సంక్రాంతి నాడే..
కొత్తపేట ప్రభల తీర్థం మకర సంక్రాంతి రోజునే నిర్వహించడం ఆనవాయితీ. ఆయా వీధులకు చెందిన 11 ప్రభలు వివిధ దేవతా మూర్తులను అలంకరించుకుంటాయి. ఈ సందర్భంగా బాణసంచా కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సాయంత్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో, రాత్రి బస్టాండ్ వద్ద బాణాసంచా కాల్పులు నిర్వహిస్తారు. పాత రామాలయం వీధి పరిధిలోని బోడిపాలెం వీధి వారు కొన్నేళ్లుగా మూడో వీధిగా అరంగేట్రం చేసి, సాయంత్రం పైరెండు వీధులతో పాటు బాణసంచా కాల్చుతున్నారు.
55 అడుగుల ఎత్తులో..
అంబాజీపేట మండలం వాకలగరువు రావిచెట్టు సెంటర్‌లో జరిగే తీర్థానికి అరుదైన గుర్తింపు ఉంది. జిల్లాలో జరిగే ప్రభల తీర్థాలలోని ప్రభలన్నింటికన్నా ఇక్కడ అతి పెద్ద ప్రభలను ఉంచుతారు. తొండవరం ఉమా తొండేశ్వరస్వామి, వాకలగరువు ఉమా సర్వేశ్వరస్వామితో పాటు గున్నేపల్లి ప్రభలు కొలువు తీరుతాయి. వాకలగరువు, తొండవరం ప్రభలు ఎత్తుగా నిర్మించడంలో ఒకదానికొకటి పోటీ పడుతూ ఉంటాయి. ఈ రెండు ప్రభలను 55 అడుగుల ఎత్తుతో నిర్మిస్తారు.
బరువు టన్నుకు పైబడే..
తాటి, వెదురు, పోక చెట్లను ఉపయోగించి భారీ ప్రభలను తయారు చేస్తుంటారు. రంగు రంగు కంకర్లు, నూలు వస్త్రాలతో వీటిని అందంగా ముస్తాబు చేస్తారు. వీటికి వరి కంకులు, కూరగాయలతో పాటు నెమలి పింఛాలను అలంకరిస్తారు. సుమారు 10 అడుగుల నుంచి 20 అడుగుల వెడల్పు, 20 అడుగుల నుంచి 55 అడుగుల ఎత్తు వరకు ఉండే ఈ ప్రభలు కనీసం టన్ను బరువు ఉంటాయి.
గుర్తింపు సరే.. నిధులు ఎక్కడ
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దీనిని రాష్ట్ర పండగా గుర్తించింది. తాము వచ్చాకా ప్రభల తీర్థానికి గుర్తింపు వచ్చిందన్నట్టుగా ప్రచారం చేసుకుంటోంది. అయితే ఈ గుర్తింపు వల్ల ఈ తీర్థానికి ఒనగూరే ప్రయోజనం ఏమిటనేది మాత్రం చెప్పడం లేదు. అధికారులు మాత్రం ఈ గుర్తింపు వల్ల కేవలం పరిపాలనా సౌకర్యాలు మాత్రమే కలుగుతాయని చెబుతున్నారు. నిధుల మంజూరు విషయంలో మాత్రం ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు.
జగన్ ప్రభుత్వంలోనే అసలైన గుర్తింపు
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జగ్గన్నతోట ప్రభల తీర్థానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. 2023లో ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పెరేడ్‌లో దీనిని రాష్ట్ర శకటంగా గుర్తించి ప్రదర్శనకు ఉంచారు. తీర్థం ఉట్టిపడేలా ఈ శకటం మీద పదకొండు ప్రభలను సంప్రదాయ బద్ధంగా తయారు చేసి ఏర్పాటు చేశారు. నాటి రిపబ్లిక్‌డే పెరేడ్‌తో ఇది జాతీయ స్థాయిలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విషయాన్ని కోనసీమ వాసులు ఇప్పుడు గుర్తుకు చేసుకుంటున్నారు.
ప్రభల తీర్థం.. కన్నుల వైభవం
ప్రభల తీర్థం.. కన్నుల వైభవం


