బరితెగించి.. జూదమాడి | - | Sakshi
Sakshi News home page

బరితెగించి.. జూదమాడి

Jan 15 2026 10:49 AM | Updated on Jan 15 2026 10:49 AM

బరితె

బరితెగించి.. జూదమాడి

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): కోర్టు ఆర్డరన్నారు.. బరులు దున్నేశామని, ఎక్కడైనా కోడిపందేలు, గుండాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటనలు ఊదరగొట్టేశారు. చిన్న బరులు.. నోరూ వాయిలేని చిన్నోళ్ల బరులు ట్రాక్టర్లతో దున్నించేసి జబ్బలు చరిచేసుకున్నారు. ఇదంతా చూసినవాళ్లు ఈ ఏడాది జిల్లాలో ఎక్కడా కోడి పందేలు ఉండవేమో.. అబ్బో మన పోలీసు యంత్రాంగం ఆహా.. ఓహో అనుకున్నారు. కానీ బడా బాబులు ఏర్పాటు చేసిన.. ప్రజా ప్రతినిధులు అండగా నిలచిన.. డబ్బూ, పలుకుబడి ఉన్నవాళ్లు నిర్వహించే బరులు ఎక్కడున్నాయో.. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో తెలిసినా కనీసం కాలు మోపే సాహసం చేయలేక చివరాఖరికి భారీ స్థాయిలో కోడి పందేలు నిర్వహిస్తున్నా ఆ వైపు వెళ్లే ప్రయత్నం కనీసం చేయలేక సాగిలబడిపోయారు. చివరి నిమిషం వచ్చేసరికి ప్రతి గ్రామంలోనూ ఎవరి స్థాయిలో వారు బరులు ఏర్పాటు చేసి కోడి పందేలు నిర్వహించారు. కూటమి నాయకుల ఆధ్వర్యంలో పాటలు పెట్టి మరి కోడిపందాలు గుండాట నిర్వహించారు. ప్రతి గ్రామంలోనూ రూ.లక్షలు చేతులు మారాయి. కోడిపందేల బరుల వద్ద మద్యం విక్రయాలు యథేచ్ఛగా సాగిపోయాయి. ప్రతి బాటిల్‌ వద్ద రూ.50 నుంచి రూ.100 అదనంగా వసూలు చేశారు. ఇంత జరుగుతున్నా పోలీస్‌ శాఖ జాడ ఎక్కడా కనిపించలేదు. జిల్లా అధికారులు కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితం అయ్యారు. ప్రధాన రహదారుల పక్కనే కోడిపందేలు నిర్వహించారు. ప్రత్యేక టెంట్లు వేసి గుండాట నిర్వహించినా పోలీసు శాఖ ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో కూటమి నేతలు బరితెగించి కోడిపందేలు గుండాట ఇష్టానుసారంగా నిర్వహించారు.

కళ్లు మూసుకున్న ఎకై ్సజ్‌శాఖ

ప్రతి గ్రామం, నగరంలోనూ కోడిపందేల బరుల వద్ద మద్యం విక్రయాలు భారీగా సాగాయి. బీరుతో పాటు లిక్కరు కూడా విక్రయించారు. ఒక్కొక్క బీరు ఎమ్మార్పీ కంటే వంద రూపాయలు అదనంగా వసూలు చేశారు. ఇక లిక్కరు కూడా క్వార్టర్‌ బాటిల్‌ వద్ద 50 నుంచి 100 వరకు అక్రమంగా వసూలు చేశారు. ఇంత జరుగుతున్నా ఎకై ్సజ్‌ శాఖ అధికారులు కనిచూపు మేరలో కానరాలేదు.

మామూళ్ల మత్తులో..

పోలీసు అధికారులు బరుల వద్దక వచ్చినా కోడిపందేలు, గుండాట నిర్వహించకుండా చర్యలు తీసుకోవడం మానేసి డబ్బులు దండుకుని వెళ్లిపోయినట్టు కొందరు ఆరోపించారు. మేము స్టేషన్‌కు మామూళ్లు ముందుగానే చెల్లించామని వచ్చిన ప్రతి పోలీసుకు డబ్బులు ఇవ్వలేమని అక్కడ కూటమి నాయకులు పోలీసులకు తెగేసి చెప్పారు. వచ్చినందుకు ఎంతోకొంత ఇవ్వాలని పోలీసులు కాళ్లా వేళ్లాపడి మరీ మామూళ్లు గుంజుకున్నారని వారు వాపోయారు. కోడిపందేల బరుల వద్ద మందుబాబులు కోడి కత్తులతో హల్‌చల్‌ చేశారు. దీంతో కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని కొవ్వూరు హైవేలో నిర్వహించిన బరిలో కోడికత్తులతో దాడి చేసుకోవడంతో ఒక వ్యక్తి చేతికి తీవ్రగాయమైంది. దీంతో అతని బంధువులు అతనిని ఆసుపత్రికి తరలించారు.

టీడీపీ, జనసేన నేతల గొడవ..

కాకినాడ సిటీ నియోజకవర్గంలో స్థానిక 8వ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్‌ చీకోటి అప్పలకొండ ఆధ్వర్యంలో సర్వహంగులతో కోటి పందేలు, గుండాట నిర్వహించారు. కోడిపందేలు చూసేవారికి సైతం కుర్చీలు ఏర్పాటు చేశారు. తమకు డబ్బులు ఇవ్వలేదని జనసేన నాయకులు, టీడీపీ నాయకులతో గొడవకు దిగారు. మేమే పార్టీ పెద్దలకు డబ్బులు ఇచ్చామని, జనసేన నాయకులందరికీ డబ్బులు ఇవ్వలేమని టీడీపీ నాయకులు చెప్పడంతో వారు అక్కడ కొంతసేపు గలాటా సృష్టించారు. నగరంలో మూడు ప్రాంతాల్లో గుండాట, కోడి పందేలు రోడ్డు పక్కనే నిర్వహించారు. సుమారు 30 లక్షలు వరకూ చేతులు మారాయి.

పెద్దాపురంలో జోరుగా..

పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో కోడిపందేలు జోరుగా సాగాయి. పోలీసులు కోడిపందాలకు అనుమతి లేదని హెచ్చరికలు జారీ చేస్తూ టెంట్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. కాగా నియోజకవర్గంలో గుడివాడ, గోరింట, పులిమేరు, ఆర్బీ కొత్తూరు ఆర్బీ పట్నం కాండ్రకోట కట్టమూరు సామర్లకోట మండల పరిధిలో జి.మేడపాడు, బీబీ దేవం, ఉండూరు అచ్చంపేట పనసపాడు గ్రామాల్లో జోరుగా కోడిపందాలు జరిగాయి. మొదటి రోజున రూ.రెండు కోట్ల వరకు కోడిపందాలు జరిగినట్లు అంచనా.

రూ.కోటికి పైగా చేతులు మారి..

ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు, రాచపల్లి, ఒమ్మంగి, ధర్మవరం, ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం, భద్రవరం, శంఖవరం మండలం శంఖవరం కత్తిపూడి రౌతులపూడి మండలం రౌతులపూడి ములగపూడి తదితర గ్రామాల్లో కోడిపందేలు నిర్వహిస్తున్నారు. సుమారు రూ.కోటి పైగా చేతులు మారినట్లు తెల్సింది.

ఉదయం నుంచే పందేలు..

నియోజకవర్గంలో జోరుగా కోడిపందేలు నిర్వహించారు. కాకినాడ రూరల్‌ తిమ్మాపురం, సర్పవరం, వాకలపూడి, వలసపాకల, గొడారిగుంట, చీడిగ, కరప మండలం, కరప, నడకుదురు, పెనుగుదురు, వేళంగి తదితర ప్రాంతాల్లో జోరుగా కోడిపందేలు జరిగాయి. ఉదయం నుంచే బరుల వద్ద పందాలు నిర్వహించడంతో ఎక్కువగా జనం వచ్చారు. సుమారు రూ.కోటి వరకు చేతులు మారినట్టు తెలుస్తోంది.

పండగ ముసుగులో జూదాలు..

మెట్ట ప్రాంతమైన జగ్గంపేట నియోజకవర్గంలో సంక్రాంతి పండగ ముసుగులో కోడి పందేలు, గుండాటలు భారీ ఎత్తున నిర్వహించారు. జగ్గంపేటలో మల్లిసాల, రాజపూడి, గోవిందపురం, కాట్రావులపల్లి, మామిడాడ, నరేంద్రపట్నం, జగ్గంపేట గ్రామాల్లో కోడిపందేలు, గుండాలు నిర్వహించారు. కిర్లంపూడి మండలంలో కిర్లంపూడి, వేలంక, తామరాడ, గోనాడ, వీరవరం, కష్ణవరం గ్రామాల్లో కోడిపందేలు, గుండాటలు జోరుగా సాగాయి. అలాగే గోకవరం మండలంలో గోకవరం, కొత్తపల్లి, మల్లవరం, కామరాజుపేట, కృష్ణునిపాలెం, వెదురుపాక, రంపయర్రంపాలెం, తిరుమలాయపాలెం, తంటికొండ గ్రామాల్లో కోడిపందేలు, గుండాటలు జోరుగా జరుగుతున్నాయి. గండేపల్లి మండలంలో గండేపల్లి, మల్లేపల్లి, యల్లమిల్లి, నీలాద్రిరావుపేట, ఎస్‌టి రాజాపురం, ఉప్పలపాడు, సింగరంపాలెం, కె.గోపాలపురం గ్రామాల్లో కోడిపందేలు, గుండాలు నిర్వహిస్తున్నారు. ఆయా గ్రామాల్లో స్థానిక టిడిపి నాయకుల ఆధ్వర్యంలో ఈ జూదాలు నిర్వహించారు. ఒక్కరోజు సుమారు 3 కోట్లు పైగా జూదాలు జరిగినట్టు సమాచారం

కూటమి కట్టి 32 బరులు..

పిఠాపురం, పిఠాపురం రూరల్‌, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లో జనసేన, టీడీపీ నాయకులు 32 బరులు ఏర్పాటు చేశారు. కోడిపందేలు, గుండాటలు జోరుగా జరుగుతున్నాయి. రోజుకి నియోజకవర్గ పరిధిలో రూ.3 కోట్లు వరకు చేతులు మారినట్టు అంచనా. నియోజకవర్గంలో 28 బరులలో టీడీపీ, జనసేన నాయకులు కలిసి ఏర్పాటు చేసుకోగా, నాలుగు బరులను జనసేన, టీడీపీ నాయకులు వేర్వేరుగా నిర్వహించారు.

తుని నియోజకవర్గంలో భారీగా..

తుని మండలం తేటగుంట, ఎస్‌.అన్నవరం హంసవరం, కుమ్మరి లోవ, వి కొత్తూరు, రాజుపేట, ఎస్‌.సురవరం, డి.పోలవరం గ్రామాలలో కోడిపందేలు జరిగాయి. కోటనందూరు మండలం కాకరపల్లిలో భారీగా కోడిపందేలు నిర్వహించారు. కాకినాడ అనకాపల్లి జిల్లాలకు చెందిన జూదర్లు ఈ పందేల్లో పాల్గొన్నారు. తొండంగి మండలంలో వేమవరం, సీతారాంపురం, పెరుమాళ్లపురం, రావికంపాడు ఎ.కొత్తపల్లి, పైడికొండ, శృంగవృక్షం వాకదారిపేట తాటి ఆకులపాలెం, బెండపూడి గ్రామాల్లో కోడిపందేలు జోరుగా సాగాయి. సుమారు రెండు కోట్లు చేతులు మారినట్టు తెలిసింది.

కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో కోడిపందేల బరి వద్ద గుండాటాడుతున్న జూదగాళ్లు

కాకినాడ రూరల్‌లో కోడికత్తులతో చేసిన దాడిలో గాయపడిన యువకుడు

కూటమి నేతల ఆధ్వర్యంలో

కోడిపందేలు, గుండాట

ప్రకటనలకే పరిమితమైన

అధికార యంత్రాంగం

చేతులు మారిన రూ.కోట్లు

కాకినాడలో పంపకాల కోసం

ఘర్షణలు

బరుల వద్ద యథేచ్ఛగా

మద్యం విక్రయాలు

బరితెగించి.. జూదమాడి1
1/1

బరితెగించి.. జూదమాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement