సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 30 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు వసంత నవరాత్ర ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని విఘ్నేశ్వర పూజ, పంచాంగ శ్రవణం, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, కలశ స్థాపనతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. నవరాత్ర ఉత్సవాల సందర్భంగా ప్రతి రోజూ స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజలు ఉంటాయన్నారు. భక్తులు రూ.200 చెల్లించి, తమ గోత్రనామాలతో ఈ తొమ్మిది రోజులూ పూజలు చేయించుకోవచ్చని ఈఓ తెలిపారు.
లోవకు పోటెత్తిన భక్తులు
తుని రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం లోవ దేవస్థానానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. దీంతో దేవస్థానం ప్రాంగణమంతా కిటకిటలాడింది. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చిన 30 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెన్మత్స విశ్వనాథరాజు తెలిపారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,81,050, పూజా టికెట్లకు రూ.1,09,860, కేశఖండన టికెట్లకు రూ.12,280, వాహన పూజలకు రూ.3,020, కాటేజీల ద్వారా రూ.73,012, ఇతర విరాళాలుగా రూ.1,21,830 కలిపి మొత్తం రూ.5,01,052 ఆదాయం వచ్చిందని వివరించారు.
నేడు పీజీఆర్‌ఎస్
కాకినాడ సిటీ: జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకూ కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి జిల్లా అధికారులందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. అలాగే, మండల స్థాయి పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి ఆయా మండలాల అధికారులందరూ విధిగా ఉదయం 9.30 గంటలకే హాజరు కావాలని అన్నారు.
డెల్టాలకు 10,700 క్యూసెక్కులు
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టా కాలువలకు ఆదివారం 10,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 3,200, మధ్య డెల్టాకు 2 వేలు, పశ్చిమ డెల్టాకు 5,500 క్యూసెక్కుల చొప్పున వదిలారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 9.80 అడుగులకు చేరింది.

30 నుంచి వసంత నవరాత్ర ఉత్సవాలు