ఇసుక డంపుల గుర్తింపు
జిల్లాలో ఆగని ఇసుక అక్రమ రవాణా
–8లో u
ఇసుక డంపులు ఎక్కడ కనిపించినా సీజ్ చేస్తున్నాం. ఇప్పటికే మండల కేంద్రంలో పలుచోట్ల డంపులను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నాం. ఇసుక తరలించే అవకాశాలు ఉన్న ప్రతిచోట నిఘా పెట్టాలని పోలీసులకు సూచించాం.
– రామ్మోహన్, తహసీల్దార్, రాజోళి
ఇప్పటికే రెండు బృందాలుగా మండలంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. ఇసుక అక్రమ రవాణాను ఆపేందుకు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాం. ట్రాక్టర్లు, టిప్పర్లపై నిఘా ఉంచాం. ఎవరి ఒత్తిడికి తలొగ్గకుండా అక్రమ రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. ఇప్పటి వరకు నమోదైన కేసులే కాకుండా ఎక్కడైనా ఇసుక అక్రమ దందా జరిగినట్లు మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం.
– కిరణ్‌కుమార్, ఎస్‌ఐ, రాజోళి
గట్టు/ రాజోళి: ఇసుక అక్రమ రవాణా రూపంలో కాసుల దందా జోరుగా సాగుతోంది. పదుల సంఖ్యలో లారీలు, టిప్పర్ల ద్వారా ఇసుకను యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొందరైతే ఏకంగా తెలంగాణ, కర్ణాటక సరిహాద్దుల్లో దర్జాగా ఇసుక డంపులను ఏర్పాటు చేసుకుని వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటు రెవెన్యూ, ఇటు పోలీస్ అధికారులు మాత్రం తమకేమి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. తెలంగాణ– కర్ణాటక సరిహద్దుల్లో నుంచి ఇసుక అక్రమ రవాణాకు బల్గెర, కర్ణాటకలోని యరిగేర రోడ్డు రాచమార్గంగా మారింది. నిత్యం అనేక వాహనాలు ఈ దారి గుండా అక్రమ ఇసుక తరలిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న భారీ లారీని గట్టు పోలీసులు పట్టుకున్నారు. నెల రోజుల వ్యవధిలో కర్ణాటక నుంచి తెలంగాణలోకి వస్తున్న మరో రెండు టిప్పర్లను పోలీసులు సీజ్ చేశారు. అయినా ఇసుక దందా ఆగడం లేదు. ఇందుకు కొందరు అధికారులు అమ్యామ్యాలకు అలవాటు పడి లోపాయికారిగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తుమ్మిళ్లలో అనుమతులు..
రాజోళిలోని తుంగభద్ర నది నుంచి రాత్రి సమయంలో ఇసుక తోడి డంపు చేసి.. ధర అధికంగా రాగానే మండల హద్దులు దాటించి కాసులు పోగేసుకోవడం నిరంతర ప్రక్రియగా మారింది. పట్టపగలు దర్జాగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఒకవైపు తుమ్మిళ్లలో ప్రభుత్వ ఇసుక రీచ్ ఉన్నప్పటికీ.. దానికి బుకింగ్ రాకుండా చేసి, ఇసుక అక్రమంగా తరలించి డబ్బులు దండుకుంటున్నారు. గడిచిన పది రోజుల్లో ఏడు ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేయగా.. రెండు టిప్పర్లను అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే ఇందులో ఒక టిప్పర్‌పై కేసు నమోదు చేయకుండా నాయకులు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక తీయనివ్వలేదని.. ప్రస్తుతం అక్రమంగా ఇసుకను తోడేస్తున్నా.. పట్టించుకోకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
గత నెలలో ముసలంపల్లి రిజర్వు ఫారెస్టుకు చెందిన సర్వే నం.38లో 12 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక డంపులను ఏర్పాటు చేసుకుని విక్రయాలను కొనసాగిస్తుండగా అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 8 నెలల క్రితం చమన్‌ఖాన్‌దొడ్డి శివారు (కర్ణాటక సరిహద్దు)లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 10 టిప్పర్ల ఇసుక డంపును కలెక్టర్ చొరవతో రెవెన్యూ అధికారులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించి సీజ్ చేయించారు. ఇసుకాసురులు అటు కర్ణాటక, ఇటు తెలంగాణ పోలీసులను మేనేజ్ చేసుకుని, తుంగభద్ర నది నుంచి కర్ణాటక మీదుగా టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక ట్రాక్టర్ డిమాండ్‌ను బట్టి రూ.3,500 నుంచి రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారు.
శివారు ప్రాంతాల నుంచి నిత్యం యథేచ్ఛగా తరలింపు
పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయని
అధికారుల దాడులు
అమ్యామ్యాలతో లోపాయికారిగా సహకరిస్తున్న వైనం
సరిహద్దులో కుప్పలు తెప్పలుగా ఇసుక డంపుల నిల్వ


