గద్వాల: జిల్లాలో అర్హులైన ప్రతి దివ్యాంగుడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా దివ్యాంగుల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యూడీఐడీ కార్డులు, సదరం సర్టిఫికెట్ల జారీలో జాప్యం లేకుండా చూసి, నకిలీ ధ్రువపత్రాల జారీపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 3 నుంచి 10 వరకు వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని, విద్య, వైద్యం, ఉపాధి, క్రీడల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులతోపాటు ఆసక్తి కలిగిన దివ్యాంగులు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా అందిస్తున్న ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాల్లో దివ్యాంగ నిరుద్యోగ యువతీ, యువకులకు ముందస్తు సమాచారం అందించి వారు పాల్గొనే ప్రోత్సహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీసీఐఓ నాగేంద్రం, జిల్లా సంక్షేమ అధికారి సునంద, డీఈఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


