● కొండారెడ్డిపల్లి తరహాలో మరో రెండు గ్రామాల్లోనూ సోలార్ ప్రాజెక్టు అమలు
● రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
మల్లు భట్టి విక్రమార్క
అచ్చంపేట: రాష్ట్రంలో సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడంతోపాటు గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన సంపూర్ణ సౌర విద్యుద్దీకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం శ్రీశైలం వెళ్తున్న ఆయన మన్ననూరులోని మృగవాణి రెస్టారెంట్ ప్రాంగణంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ అధ్యక్షతన టీజీఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లిలో అమలు చేస్తున్న సౌర విద్యుత్ నమూనాను బల్మూరు మండలంలోని కొండారెడ్డిపల్లి, తాడూరు మండలంలోని తూడుకుర్తి గ్రామాల్లోనూ అమలు చేసి, మూడు గ్రామాలను సంపూర్ణ సౌర విద్యుద్ధీకరణకు ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. సౌర విద్యుద్దీకరణ కేవలం గృహ అవసరాలకు మాత్రమే కాకుండా.. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కూడా సౌర విద్యుత్ అందించడం ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకం అని పేర్కొన్నారు. రైతుల వ్యవసాయ అవసరాలకు సౌర విద్యుత్‌ను వినియోగించుకునేలా అవసరమైన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా.. విద్యుత్ సరఫరాలో లోపాలు గుర్తించినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు అవసరమైన సామగ్రి, పరికరాల కొరత లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. విద్యుత్ సరఫరాపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. కాబట్టి సమస్యలను తక్షణమే పరిష్కరించేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. అనంతరం బ్రహ్మగిరి (దోమలపెంట)లో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు.


