బదిలీపై వెళ్తే.. బోధించేదెవరు? | - | Sakshi
Sakshi News home page

బదిలీపై వెళ్తే.. బోధించేదెవరు?

Sep 1 2026 1:01 AM | Updated on Sep 1 2026 1:01 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఒకవైపు డీఎస్సీ ద్వారా నియామకాలు సకాలంలో జరగకపోవడం.. మరోవైపు పదవీ విరమణ చేసిన వారి స్థానాల్లో పోస్టులు భర్తీ కాకపోవడంతో విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా బోధన అందడం కష్టంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బడుల్లో బోధించాల్సిన స్కూల్‌ అసిస్టెంట్‌ స్థాయి ఉపాధ్యాయులను ఫారిన్‌ సర్వీస్‌, డీఈఓ కార్యాలయాలు, మానిటరింగ్‌ కమిటీలకు కేటాయిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇప్పటికే 75 మందికిపైగా ఉపాధ్యాయులు ఫారిన్‌ సర్వీస్‌పై వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే మరో 33 మందికి పైగా ఉపాధ్యాయులను ఫారిన్‌సర్వీస్‌పై పంపేందుకు ప్రక్రియ చేపట్టారు. ఇందులో బీఈడీ కళాశాలకు 10 మంది, డైట్‌ కళాశాలకు 12 మంది ఉండగా.. మిగిలిన వారు డీఈఓ కార్యాలయంలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహించనున్నారు. వీరితో పాటు పాఠశాలల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన మానిటరింగ్‌ కమిటీల్లోనూ పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులను కేటాయించారు.

ఒక్క జిల్లాలోనే 33 మందికిపైగా..

మహబూబ్‌నగర్‌ జిల్లాలో 33 మందికిపైగా ఉపాధ్యాయులు ఫారిన్‌ సర్వీస్‌లో ఉండగా.. వీరిలో 22 మంది బీఈడీ, డైట్‌ కళాశాలల్లో, మిగతా వారు డీఈఓ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఇతర డీఈఓ కార్యాలయాల్లోనూ పలువురు ఉపాధ్యాయులు బోధనేతర విధుల్లో ఉన్నారు. ఇదిలా ఉండగా.. పాఠశాలల పర్యవేక్షణ, మధ్యాహ్న భోజనం, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాల కోసం ఏర్పాటు చేసిన మానిటరింగ్‌ కమిటీల్లోనూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 81 మంది ఉపాధ్యాయులను కేటాయించారు. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌లో ఆరు చొప్పున, మిగతా జిల్లాల్లో ఐదు చొప్పున కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ నెల 19 నుంచి వీరికి రాష్ట్రస్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు.

బడుల్లో సబ్జెక్టు టీచర్ల కొరత

ఉపాధ్యాయుల కొరతతో ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా బోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్ల కొరత ఉండగా.. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను ఫారిన్‌ సర్వీస్‌, డీఈఓ కార్యాలయాలు, మానిటరింగ్‌ కమిటీలకు కేటాయించడంతో బోధనపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాలో 200 మందికిపైగా ఉపాధ్యాయులు బోధనేతర విధుల్లో ఉండటంతో వారి స్థానాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే విద్యార్థులకు సబ్జెక్టు బోధనలో నష్టం జరిగే ప్రమాదం ఉంది. సర్దుబాటులో భాగంగా ఎస్జీటీలను ఉన్నత పాఠశాలలకు పంపే అవకాశం ఉన్నా.. సబ్జెక్టు నిపుణులైన స్కూల్‌ అసిస్టెంట్ల స్థానాన్ని తాత్కాలిక ఏర్పాట్లతో భర్తీ చేయడం ఎంతవరకు సాధ్యమన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

బీఈడీకి 10, డైట్‌కు 12 మంది

ఉమ్మడి జిల్లాకు ఒకే ఒక్క బీఈడీ కళాశాల, ఒక డైట్‌ కళాశాల ఉంది. ఇందులో అధ్యాపకులు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను బదిలీ చేశారు. బీఈడీ కళాశాలలో ఉన్న ఏకై న రెగ్యులర్‌ పోస్టు గోవిందరాజులు నారాయణపేట ఇన్‌చార్జి డీఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక డైట్‌ కళాశాలలో రెండు రెగ్యులర్‌ పోస్టులు ఉండగా ఇటీవల మహబూబ్‌నగర్‌ డీఈఓగా విధులు నిర్వహించిన రవీందర్‌ లంచం తీసుకుంటూ పట్టుబడి సస్పెన్షన్‌లో ఉన్నారు. మరో పోస్టులో ప్రస్తుత డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ మెరాజుల్లాఖాన్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఇక రెండు కళాశాలల్లో పోస్టుల భర్తీకి సీబీటీ పరీక్ష నిర్వహించి ఈ నెల 6వ తేదీన బీఈడీ కళాశాలకు, 7వ తేదీన డైట్‌ కళాశాలకు ఇంటర్వ్యూ, డెమోలు నిర్వహించారు. బీఈడీ కళాశాలకు 10 మంది, డైట్‌ కళాశాలకు 12 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఏడాది కాలానికి ఫారిన్‌ సర్వీస్‌పై విధులు కేటాయించనున్నారు. గతంలో తాత్కాలికంగా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న కొందరి డిప్యూటేషన్లు రద్దు చేసి.. తాజాగా ఎంపికై న వారికి అవకాశం కల్పించనున్నారు.

బడుల్లో సబ్జెక్టు టీచర్ల కొరత.. అయినా ఇతర విధులకు కేటాయింపు

బీఈడీ, డైట్‌ కళాశాలలకు 22 మంది.. డీఈఓ కార్యాలయాల్లో మరికొందరు

ఉమ్మడి జిల్లాలో 75 మందికిపైగా ఫారిన్‌ సర్వీస్‌లో..

81 మంది మానిటరింగ్‌ టీంల్లో..

అనుభవజ్ఞులైన స్కూల్‌ అసిస్టెంట్లను బోధనేతర విధులకు పంపడంపైవిమర్శలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement