గద్వాల/ఉండవెల్లి/అలంపూర్ రూరల్: జిల్లాను రైల్వే హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం గద్వాల రైల్వేస్టేషన్‌లో చేపట్టిన వివిధ రకాల అభివృద్ధి పనులను ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ముందుగా స్టేషన్ అభివృద్ధిపై ఏర్పాటుచేసిన చిత్రప్రదర్శనను తిలకించారు. అదే విధంగా జోగుళాంబ హాల్ట్‌లో రూ.6కోట్లతో చేపట్టిన నిర్మాణాలను ఎమ్మెల్యే విజయుడుతో కలిసి మంత్రి పరిశీలించారు. పనుల పురోగతిపై రైల్వే డీఆర్‌ఎం సంతోష్‌కుమార్ వర్మతో చర్చించారు. అనంతరం గద్వాల స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. గద్వాల సంస్థానం సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించేలా రైల్వేస్టేషన్ తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ప్రయాణికులకు సౌకర్యవంతంగా మరో టికెట్ కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడి రైల్వేస్టేషన్ ప్రారంభమై వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 520 ఆర్‌ఓబీ, ఆర్‌యూబీ నిర్మాణాలను పూర్తిచేశామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రూ. 4,883కోట్లతో 118 ఆర్‌ఓబీ, ఆర్‌యూబీల పనులు చేపడుతున్నట్లు వివరించారు. గద్వాలలో రూ. 66కోట్లతో మరో ఆర్‌ఓబీ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. జోగుళాంబ హాల్ట్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం రూ.45కోట్లతో హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తామన్నారు. పలు రాష్ట్రాల నుంచి అలంపూర్ క్షేత్రానికి భక్తులు వస్తున్న తరుణంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. జోగుళాంబ హాల్ట్‌లో అన్ని రైళ్లను నిలిపే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అలంపూర్ క్షేత్రంలో భక్తులకు అన్ని వసతులు కల్పించేందుకు కేంద్ర పర్యాటకశాఖ ద్వారా రూ. 37కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. పర్యాటక అబివృద్ధి పనులపై ఎంపీ, కలెక్టర్‌తో త్వరలోనే సమీక్షిస్తామన్నారు. రైల్వేలైన్ డంబ్లింగ్‌తో భూములను నష్టపోతున్న రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామని భరోసానిచ్చారు.
● ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ.. విమానాశ్రయాన్ని తలపించేలా గద్వాల రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇక్కడి రైల్వేస్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లకు స్టాపింగ్ లేదని.. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, త్వరలోనే అన్ని రైళ్లు ప్రజలకు సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. గద్వాల–డోర్నకల్, మాచర్ల–గద్వాల రైల్వేలైన్ ఏర్పాటుకు ప్రయత్నిస్తామన్నారు. ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ.. గద్వాల సంస్థానాదీశులు రైల్వేస్టేషన్ నిర్మాణానికి 100 ఎకరాలకు పైగా స్థలం కేటాయించారని.. ఈ స్థలంలో రైల్వే ప్రాజెక్టులను తీసుకొచ్చి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు.
జిల్లా కేంద్రంలో రూ.66కోట్లతో మరో ఓఆర్‌బీ నిర్మాణం
రూ.42.82కోట్లతో రైల్వేస్టేషన్ అభివృద్ధి
జోగుళాంబ హాల్ట్‌లో
రూ.45కోట్లతో హైలెవల్ బ్రిడ్జి
కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి


