సర్వం సిద్ధం..
● నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు
● జిల్లాలో 14 కేంద్రాల ఏర్పాటు
● హాజరుకానున్న 8,471 మంది విద్యార్థులు
● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
మాస్ కాపీయింగ్ నిరోధానికి సిట్టింగ్, ఫ్లయింగ్ సా్‌వ్క్‌డ్స్ ఏర్పాటుచేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందంలో సీనియర్ లెక్చరర్‌తో పాటు రెవెన్యూ అధికారి, ఓ ఏఎస్‌ఐ ఉంటారు. సిట్టింగ్ స్క్వాడ్ బృందంలో ఇద్దరు సీనియర్ లెక్చరర్లు ఉంటారు. వీరు ఎప్పటికప్పుడు కేంద్రాలను పర్యవేక్షిస్తారు. పోలీసు బందోబస్తు నడుమ పరీక్షలు సజావుగా సాగేలా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి కేంద్రంలో విద్యార్థులను పూర్థిస్థాయిలో తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులను ఉదయం 8:30 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. నిమిషం నిబంధనను కొంత సడలించినారు. పరీక్ష కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది, అధికారులు, ఇన్విజిలేటర్లు తప్పనిసరిగా గుర్తింపుకార్డు తమ వద్ద ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎవరికి కూడా సెల్‌ఫోన్ అనుమతి లేదు.
గద్వాల: ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇది పరీక్షా కాలం. ఇన్నాళ్లు తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టిన వారు ఇప్పుడు పరీక్షలు సజావుగా రాస్తేనే మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుంటుంది. ఉత్తమ ఫలితాలు రాబట్టాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఆయా కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఇంటర్మీడియట్‌లో ప్రతిభ చాటితేనే ఉజ్వల భవితకు బాటలు పడతాయి. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. బుధవారం నుంచి వచ్చేనెల 18వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కలెక్టర్ బీఎం సంతోష్, అదనపు కలెక్టర్లు నర్సింగ్‌రావు, లక్ష్మీనారాయణ సంబంధిత అధికారులతో ఇప్పటికే ఏర్పాట్లపై సమీక్షించి.. పరీక్షలు సజావుగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.


