మొబైల్ యాప్‌తో సేవలు
గద్వాల: మీసేవ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చిందని కలెక్టరేట్ ఏఓ భూపాల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో మొౖబైల్ యాప్ వినియోగంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీసేవ కేంద్రంలో స్వీకరించే దరఖాస్తులను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన మీసేవ ఫీల్డ్ వెరిఫికేషన్ మొబైల్ యాప్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో వివరాలను యాప్‌లో నమోదు చేసి.. జియోట్యాగ్‌తో లైవ్ ఫొటోలు అప్‌లోడ్ చేయడం ద్వారా నకిలీ దరఖాస్తులకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా మేనేజర్ శివ, ఆర్‌ఐలు, గ్రామపరిపాలన అధికారులు పాల్గొన్నారు.
నేడు మిషన్ భగీరథ
నీటి సరఫరా నిలిపివేత
ధరూరు: జిల్లావ్యాప్తంగా బుధవారం మిషన్ భగీరథ పథకం నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు రవిచంద్రకుమార్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేవులపల్లి వద్ద ఉన్న మిషన్ భగీరథ పథకం హెడ్‌వర్క్స్ నీటిశుద్ధి కార్మాగారాన్ని శుభ్రపరిచేందుకు నీటి సరఫరా బంద్ చేస్తున్నట్లు పేర్కొ న్నారు. గురువారం యథావిధిగా సరఫరా ఉంటుందని తెలిపారు.
బీచుపల్లి హుండీ ఆదాయం రూ.58.66లక్షలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని అభయాంజనేయస్వామి ఆలయ హుండీని మంగళవారం దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరమ్మ సమక్షంలో లెక్కించారు. ఏడాదిగా భక్తులు సమర్పించిన కానుకలను రెండురోజుల పాటు లెక్కించగా.. రూ. 58,66,649 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ రామన్‌గౌడ్ తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో గద్వాల యూనియన్ బ్యాంకు సిబ్బంది, ఆలయ అర్చకులు, సిబ్బంది, వనపర్తి సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా రూ.8,852
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు మంగళవారం 319 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటాకు గరిష్టంగా రూ. 8,852, కనిష్టంగా రూ. 3,100, సరాసరి రూ. 6,700 ధర పలికింది. అదే విధంగా 24 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,116, కనిష్టంగా రూ. 6,889, సరాసరి రూ. 7,039 ధరలు వచ్చాయి. 10 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,129, కనిష్టంగా రూ. 6,019, సరాసరి రూ. 6019 ధరలు పలికాయి.


