ప్రజారోగ్య సంరక్షణే లక్ష్యం
అలంపూర్/మానవపాడు: ప్రజారోగ్య సంరక్షణే లక్ష్యంగా 108, 102 సిబ్బంది పనిచేయాలని నేషన ల్ క్వాలిటీ ఆడిటర్ షేక్ ఫయాజ్ అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో మంగళవారం అలంపూర్, ఉండవెల్లి, వడ్డేపల్లి మండలాలకు చెందిన 108, 102 అంబులెన్స్‌లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌ల్లో ఆక్సిజన్ సిలిండర్లు, సక్షన్ మెషీన్, మానిటర్లు, స్ట్రెచర్లు తదితర పరికరాల పనితీరుతో పాటు మందుల నిల్వలు, వాటి గడువు తేదీలు, స్టాక్ రిజిస్టర్, పేషెంట్ కేర్ తదితర రికార్డులను పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానం, రోగుల తరలింపు, పరిశుభ్రత, భద్రతా నియమాలపై ఆరా తీశారు. సేవలను మరింత మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. 108 సిబ్బంది ప్రజలకు అంకితభావంతో సేవలు అందించాలన్నారు. అత్యవసర సమయాల్లో ఒక క్షణం కూడా ఎంతో విలువైనదని.. ఉద్యోగులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం జిల్లా మేనేజర్ రత్నమయ్య మాట్లాడుతూ.. 108 సేవలను ప్రజలకు అత్యవసర సమయంలో వేగవంతంగా అందిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. వారి వెంట ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీ షియన్లు ఆనంద్, రాధామోహన్, రేణుక, దేవేందర్, పైలెట్లు నరేష్, సురేశ్ ఉన్నారు.


