మున్సిపల్ ఎన్నికలపై నిఘా
గద్వాల క్రైం: మున్సిపల్ ఎన్నికలపై జిల్లా పోలీసుశాఖ నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తు ఎలాంటి అల్లర్లు, హింసత్మక ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, అలంపూర్, అయిజ, వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల నిర్వహించనున్న నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఈ నెల 3 వరకు ఉపసంహరణలకు అవకాశం ఉండడంతో దాని తర్వాత అసలుసిసలైన ఎన్నికల వేడి రాజుకోనుంది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అభ్యర్థులు తదితర వివరాలపై ఇప్పటికే ఫ్లయింగ్ సర్వైలైన్ టీం(ఎఫ్‌ఎస్‌టీ), స్టాటిక్ సర్వైలైన్స్(ఎస్‌ఎస్‌టీ) బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓటర్లకు పంచే మద్యం, నగదు, వస్తువులు వంటివి కట్టడి చేయడంతో పాటు వాటిని అందించే వారిపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. గద్వాల 37, అయిజ 20, అలంపూర్ 10, వడ్డేపల్లి 10 మొత్తం 77 వార్డు స్థానాల్లో అభ్యర్థులు తమ భవితవ్యం తేల్చుకోనున్నారు. ఆయా మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక బృందం సమస్యాత్మక అంశాలపై నివేదికలను సేకరిస్తున్నారు. తాజాగా శనివారం రాత్రి జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో అకస్మాత్తుగా కార్డెన్ సెర్చ్ నిర్వహించి అనుమతి లేని బైక్‌లు, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
50 వేల లోపే నగదు..
కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికల నియమావళి మేరకు రూ. 50వేల కంటే అధికంగా నగదు తీసుకెళ్లరాదు. అత్యవసరంగా తీసుకెళ్లాంటే నగదుకు సంబంధించిన సరైన ఆధారాలు, వాటికి సంబంధించిన రశీదులు అధికారులకు చూపించాల్సి ఉంటుంది. పెద్ద మొత్తంలో వస్తు సామగ్రి, మద్యం, చీరలు, ఇతర ఒకే రకమైన వస్తువులు తీసుకెళ్లినా ఆధారాలు చూపించాల్సిందే. లేని తరుణంలో అధికారులు వాటిని సీజ్ చేస్తారు.
ముందుస్తు అరెస్టులు.. బైండోవర్లు
విస్తృతంగా తనిఖీలు
భద్రత ఏర్పాట్లపై కసరత్తు
నగదు.. మద్యం పంపిణీపై ప్రత్యేక దృష్టి
విస్తృతంగా తనిఖీలు...
జిల్లాకు సంబంధించి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లోని పోలీసు సిబ్బంది చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వార్డుల్లో, ప్రతి మున్సిపల్ పరిధిలో ప్రత్యేక బృందం ఎన్నికల నియమావళికి సంబంధించిన ఫిర్యాదులపై స్పందిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. తహసీల్దార్ స్థాయి అధికారి, నలుగురు పోలీసులు, వీడియోగ్రాఫర్ సైతం విధుల్లో ఉంటున్నారు. స్టేషన్ పరిధిలోని సిబ్బంది, ప్రత్యేక బృందం సమస్యాత్మక పోలీంగ్ కేంద్రాలను సందర్శించి అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. పాత నేరస్తులు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీ షీట్‌ల వివరాలు సేకరిస్తున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో అల్లర్లు సృష్టించిన వారిపై నిఘా ఉంచడంతో పాటు బైండోవర్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో అనుచిత వాఖ్యలు చేసినా, ఫార్వర్డ్ మెసేజ్ చేసినా, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించిన ఎన్నికల నియమావళి ప్రకారం కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


