కార్మికులకు కనీస వేతనాలు అందించాలి
రాజోళి: సంఘటిత, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు వారి పనిని బట్టి కనీస వేతనాలు అందించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నర్సింహ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం అందించాలని, ఎనిమిది గంటలు మాత్రమే పని చేయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలన్నారు. వాటికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న కేంద్ర కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయని, దానికి ప్రతి కార్మికుడు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాజోళి మండల కన్వీనర్ లక్ష్మన్న, వెంకటేశ్వర్లు, లీలావతి, చిట్టెమ్మ, బీసమ్మ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


