సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ
గద్వాల: గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. అనంతరం అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఏమైనా సందేహాలు ఉత్పన్నమైతే తన దృష్టికి తీసుకొచ్చి నివృత్తి చేసుకోవాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తు కేటాయించడం జరుగుతుందని, మిగిలిన ఎన్నికల ప్రక్రియ మొత్తం ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఉంటుందన్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి మాస్టర్ శిక్షకులు అవసరమైన శిక్షణ అందిస్తారన్నారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతల అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి.. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, జెడ్పీ సీఈఓ నాగేంద్రం, మున్సిపల్ కమిషనర్ జానకీరామ్ తదితరులు ఉన్నారు.


