సస్యరక్షణతోనే అధిక దిగుబడులు
ఎర్రవల్లి: రైతులు పంటల సాగులో సరైన సస్యరక్షణ చర్యలు చేపడితేనే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియా నాయక్ అన్నారు. మంగళవారం ఇటిక్యాల మండల కేంద్రంతో పాటు శివనంపల్లి, మునుగాల గ్రామాల్లో సాగుచేసిన వేరుశనగ పంటను ఆయన సందర్శించారు. జాతీయ నూనెగింజల అభివృద్ధి పథకం కింద రైతులకు 100 శాతం సబ్సిడీతో అందించిన మేలు రకం వంగడం గిరినార్–5, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా సభ్యత్వం పొందిన రైతులకు అందించిన వేరుశనగ సాగును కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి.. రైతులకు పలు సూచనలు చేశారు. వేరుశనగ పంటలో 40–75 రోజుల వరకు ఎలాంటి చీడపీడలు ఆశించకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. అనంతరం ఎర్రవల్లి రైతువేదికలో ఏర్పాటుచేసిన రైతునేస్తం కార్యక్రమంలో డీఏఓ పాల్గొని యాసంగి పంటల సాగులో చేపట్టాల్సిన వివిధ యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఓ రవికుమార్, ఎఫ్‌యూసీఓయూ రఘురామిరెడ్డి, ఏఈఓ వెంకటేశ్ పాల్గొన్నారు.


