42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమించాలి
గద్వాలటౌన్: స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా మరో ఉద్యమానికి సిద్ధం కావాలని బీసీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక వాల్మీకి భవన్‌లో జరిగిన బీసీ చైతన్య సదస్సుకు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, బహుజన విద్యావేత్త అక్కల బాబుగౌడ్, బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్‌కుమార్‌తో పాటు జిల్లా బీసీ, బహుజన ఉద్యమ నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, మధుసూధన్‌బాబులు ప్రధాన వక్తలుగా హాజరై మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు, రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించే వరకు బీసీలు ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించే విషయంలో కొన్ని పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, బీసీల రిజర్వేషన్ల విషయంలో ఆ పార్టీలకు చిత్తశుద్ది లేదని విమర్శించారు. రాజ్యాంగంలో పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేసిన నాయకులు, బీసీ రిజర్వేషన్లను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్రంలోని అగ్రవర్ణ పాలకులు తాము ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చి, రాష్ట్రపతి ఆమోదంతో గ్యారంటీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాజకీయ పార్టీలకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సదస్సులో పలు తీర్మాణాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, వివిధ సంఘాల నాయకులు అతికూర్ రెహమాన్, వాల్మీకి, శంకర ప్రభాకర్, వినోద్‌కుమార్, కుర్వ పల్లయ్య, కృష్ణయ్య, రహిమతుల్లా, అచ్చన్నగౌడ్, నాగన్న, కిరణ్, నర్సింహా, రాంబాబు, ప్రకాష్, రాజు, తాహేర్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.


